గ‌డ్డి అన్నారం మార్కెట్ కూల్చివేత‌లు ఆపండి: హైకోర్టు

హైద‌రాబాద్ (CLiC2NEWS): గ‌డ్డి అన్నారం మార్కెట్‌లో కూల్చివేత‌లు ఆపాల‌ని, వ్యాపారులు త‌మ వ‌స్తువుల‌ను తీసుకొనేందుకు అనుమ‌తించాల‌ని ఉన్న‌త న్యాయ‌స్థానం ఆదేశించింది. ఈ రోజు గ‌డ్డి అన్నారం ప్రూట్ మార్కెట్‌లో పాత షెడ్లు, భ‌వ‌నాల తొల‌గింపు ప‌నులు అధికారులు చేప‌ట్టారు. ఈ విష‌యంలో వ్యాపారులు మ‌రోసారి హైకోర్టును ఆశ్ర‌యించారు. హైకోర్టు ఇచ్చిన ఆదేశాలు పాటించ‌లేద‌ని కోర్టు ధిక్క‌ర‌ణ పిటిష‌న్ దాఖ‌లు చేశారు. నెల రోజులు మార్కెట్ తెర‌వాల‌న్న కోర్టు ఆదేశాలు అమ‌లు కాలేద‌ని పిటిష‌న్‌లో పేర్కొన్నారు. ఈ పిటిష‌న్‌పై హైకోర్టు విచార‌ణ చేప‌ట్టింది. మార్కెట్ కూల్చివేత‌ల తీరు దుర‌దృష్ట‌క‌ర‌మ‌ని ప్ర‌ధాన న్యాయ‌మూర్తి జ‌స్టిస్ స‌తీష్ చంద్ర ధ‌ర్మాసనం వ్యాఖ్యానించింది. మార్కెటింగ్ శాఖ ముఖ్య కార్య‌ద‌ర్శి, డైరెక్ట‌ర్ కోర్టుకు హాజ‌రుకావాల‌ని ఆదేశించింది.

కాగా వ్యాపారులు త‌మ వ‌స్తువుల‌ను బాట సింగారం త‌ర‌లించేందుకు వీలుగా నెల రోజుల పాటు మార్కెట్ తెర‌వాల‌ని గ‌త నెల 8వ తేదీన హైకోర్టు ఆదేశించింది. గ‌తంలో పండ్ల మార్కెట్ స్థ‌లాన్ని రోడ్లు, భ‌వ‌నాల శాఖ‌కు మార్కెటింట్ శాఖ అప్ప‌టించిన విష‌యం తెలిసిన‌దే. ఈ మార్కెట్ స్థ‌లంలో సూప‌ర్ స్పెషాలిటీ హాస్పిట‌ల్ నిర్మించాల‌ని ప్ర‌భుత్వం భావిస్తోంది. అందుకోసం బాట సింగారం లాజిస్టిక్ పార్క్‌లో తాత్కాలికంగా మార్కెట్ కార్య‌క‌లాపాలు కొన‌సాగించాల‌ని నిర్ణ‌యించింది. కొహెడ‌లోని శాశ్వ‌త మార్కెట్ పూర్త‌య్యే వ‌ర‌కు బాట సింగారం లోనే అమ్మ‌కాలు జ‌రుగుతాయ‌ని మార్కెటింగ్ శాఖ వ‌ర్గాలు వెల్ల‌డించాయి.

Leave A Reply

Your email address will not be published.