సానియా మీర్జాపై ఎమ్మెల్యే రాజా సింగ్ సంచలన ఆరోపణలు

హైదరాబాద్: ప్రముఖ టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జాపై హైదరాబాద్ గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన ఆరోపణలు చేశారు. వికారాబాద్‌ జిల్లా దామగుండలో ఆవును తుపాకీతో కాల్చి చంపిన కేసులో సానియా మీర్జా ఉందంటూ రాజా సింగ్ ఆరోపించారు. ఫామ్‌హౌస్‌లో సానియా మీర్జానే కాల్పులు జరిపిందని గ్రామస్తులు చెప్తున్నట్లు రాజా సింగ్ పేర్కొన్నారు. సానియా గతంలో కూడా నెమలిని చంపినట్లు గ్రామస్థులు ఆరోపణలు చేస్తున్నారని బీజేపీ ఎమ్మెల్యే అన్నారు. గోమాతపై జరిగిన కాల్పుల ఘటనపై తెలంగాణ ప్రభుత్వం సమగ్రంగా దర్యాప్తు జరిపించాలని ఎమ్మెల్యే రాజాసింగ్ డిమాండ్ చేశారు. కాగా వికారాబాద్ అడ‌వుల్లో ఇటీవ‌ల జ‌రిగిన కాల్పుల ఘ‌ట‌న‌లో సానియా మీర్జా ఫామ్‌హౌస్ ఇంఛార్జి ఉమర్‌ను పోలీసులు మంగళవారం అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. నాలుగు రోజుల క్రితం ఫామ్‌హౌస్‌లో మేత‌కు వచ్చిన ఆవును కాల్చి చంపిన‌ట్లు ఉమ‌ర్‌పై ఆరోప‌ణ‌లు వ‌చ్చాయి. ఈ విష‌య‌మై స్థానికుల ఫిర్యాదు మేర‌కు పోలీసులు ద‌ర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలోనే ఎమ్మెల్యే రాజాసింగ్ సానియా మీర్జాపై ఆరోపణలు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది.

Leave A Reply

Your email address will not be published.