కేంద్ర స‌ర్కార్‌పై సుప్రీంకోర్టు సీరియ‌స్‌

న్యూఢిల్లీ: రైతు ఆందోళనల నేపథ్యంలో కేంద్రం తీరుపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. కొత్త వ్య‌వ‌సాయ చ‌ట్టాల అమ‌లును మీరు నిలిపేస్తారా లేక మ‌మ్మ‌ల్ని ఆ ప‌ని చేయ‌మంటారా అంటూ ప్ర‌శ్నించింది. ఈ చ‌ట్టాల‌పై దాఖ‌లైన ప‌లు పిటిష‌న్ల‌పై సోమ‌వారం అత్యున్న‌త న్యాయ‌స్థానం విచారణ జ‌రిపింది. ఒక్క పిటిష‌న్ కూడా ఈ చ‌ట్టాలు ల‌బ్ధి చేకూర్చుతాయ‌ని చెప్ప‌లేద‌ని ఈ సంద‌ర్భంగా ధ‌ర్మాస‌నం స్ప‌ష్టం చేసింది. విచార‌ణ‌లో భాగంగా చీఫ్ జ‌స్టిస్ ఆఫ్ ఇండియా బోబ్డే కేంద్రం తీరుపై ఘాటైన వ్యాఖ్య‌లు చేశారు. మేము ఏవో విచ్చ‌ల‌విడి వ్యాఖ్య‌లు చేయ‌ద‌ల‌చుకోలేదు కానీ కేంద్ర ప్ర‌భుత్వంపై చాలా అసంతృప్తిగా ఉంది. ఏం సంప్ర‌దింపుల ప్ర‌క్రియ కొన‌సాగుతుందో మాకు తెలియ‌దు. అస‌లు ఏం జ‌రుగుతోందో ద‌య‌చేసి చెబుతారా అంటూ బోబ్డే ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.
”మీకు అభ్యంతరం ఉంటే చెప్పండి. మేమే ఆ చట్టాలను నిలిపివేస్తాం” అని కోర్టు వ్యాఖ్యానించింది. ’’ఇందులో అహం ఎందుకు? ఏదైనా తప్పు జరిగితే మనలో ప్రతి ఒక్కరమూ బాధ్యత వహించాలి. మా చేతులకు రక్తం అంటుకోవాలని మేం భావించడం లేదు” అని ప్రధాన న్యాయమూర్తి ఎస్‌ఎ.బాబ్డే నేతృత్వంలోని ధర్మాసనం వ్యాఖ్యానించింది. పరిస్థితి మరింత దిగజారిందని మండిపడింది.

ఈ చట్టాలపై కమిటీని ఏర్పాటు చేయాలని కేంద్రాన్ని ఆదేశించింది. రైతుల ఆందోళనలను కేంద్ర ప్రభుత్వం సరిగ్గా హ్యాండిల్‌ చేయలేకపోయిందని, అందుకే సోమవారం తామే ఓ నిర్ణయం తీసుకుంటామని జస్టిస్‌ బాబ్డే స్పష్టం చేశారు. అటార్నీ జనరల్‌ కేకే వేణుగోపాల్‌ ప్రభుత్వం తరపున తమ వాదనలను వినిపించారు. చట్టాలను నిలిపివేయడం మాత్రం కుదరదని, దీనిపై సుప్రీం ఓ కమిటీని ఏర్పాటు చేయవచ్చని ఆయన అన్నారు.

Leave A Reply

Your email address will not be published.