మానసిక వికలాంగురాలిపై లైంగిక దాడి.. నిందితుడికి 10 ఏళ్లు జైలుశిక్ష
పెద్దపల్లి (CLiC2NEWS): ఎలిగేడు మండలానికి చెందిన మానసిక వికలాంగురాలిపై లైంగిక దాడికి పాల్పడిన నిందితునికి న్యాయస్థానం 10 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష, రూ.10,000 జరిమానా విధించింది. పెద్దపల్లి ఎలిగేడు మండలానికి చెందిన బాధితురాలు మానసిక వికలాంగురాలు . తల్లిదండ్రులు వ్యవసాయ పనులకోసం వెళ్లగా ఆమె ఇంటివద్దనే ఉండేది. 2023 జులై 14వ తేదీన బాధితురాలి ఇంటి పక్కనే ఉండే న్యాతారి రామయ్య లైంగిక దాడికి పాల్పడ్డాడు. విషయం ఎవరికైనా చెబితే చంపుతానని బెదించాడు. పొలం పనుల నుండి ఇంటికి వచ్చిన తల్లికి బాధితురాలు జరిగిన విషయం తెలిపింది.
వెంటనే జూలపల్లి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. సుల్తానాబాద్ సిఐ కె. జగదీష్ దర్యాప్తు ప్రారంభించి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం న్యాయస్థానం ఎదుట హాజరుపరిచి రిమాండ్‌కు తరలించారు.
పెద్దపల్లి జిల్లా కోర్టు న్యాతారి రామయ్య నేరానికి పాల్పడినట్లు రుజువు కావడంతో అతనికి 10 సంవత్సరాల కఠిన కారాగార శిక్షతో పాటు రూ.10,000 జరిమానా విధించారు. అంతే కాకుండా బాధితురాలికి రూ.4,00,000 పరిహారం అందించాలని జిల్లా న్యాయ సేవా సంస్థకు ఆదేశాలు జారీ చేశారు.