షేక్.బహర్ అలీ: మీరు యోగ నేర్చుకోవాలనుకుంటున్నారా?

పార్ట్‌-I

అయితే ముందుగా మీరు ఏమి చేయాలి, ఎలా చేయాలి? అని అంశం మీద ఈ రోజు చెప్పుకుందాం.

యోగ శిక్షణ తీసుకునే వారం ముందు ఎటువంటి మత్తు పదార్దాలు కానీ మాంసాహారం కానీ ఘన పదార్దాలు కానీ తినరాదు.

ముందుగా శిక్షణ నేర్చుకునేవారు “శంఖ ప్రక్షాళన “చేయాలి. శంఖం అనగా ప్రేగు, ప్రక్షాళన అనగా శుద్ధిచేసుకోవటం.ఈ క్రియ వలన కంఠం నుండి గుదము వరకు, ఆహార నాళం అంతా శుభ్రపడుతుంది.ఈ విధంగా శరీరాన్ని అంతటిని శుభ్రపరుచుకొని, అక్కర లేని విషతుల్య పదార్దాలను బయటికి పడేయటానికి ఇది తోడ్పడుతుంది.ఉదరసంబంధమైన రోగాలు, ఊపిరితిత్తులు, వాత, పిత్త, కఫ, రోగాలు, వేడి వలన కలిగే రోగాలు, జలుబు, కంటి జబ్బులు, తల నొప్పులు, ఈ క్రియ వలన తగ్గుతాయి. దూమపానం వంటి చెడు అలవాట్లను, ఇది పోగొడుతుంది.

1. చేసే విధానం.. 2 లీటరుల నీరు తీసుకొని వేడి చేసి దానిని తిరిగి కొద్దిగా గోరువెచ్చగా ఉన్నపుడు దానిలో మనకు కఫం ఉంటే చిటికెడు ఉప్పు వేయాలి. ఒక వేళ బీపీ ఉంటే ఒక టీ స్పూన్ నిమ్మరసం వేయాలి. బీపీ ఉంటే ఉప్పు వేయరాదు.

1. ముందుగా కింద కూర్చొని ఒక గ్లాస్ నీటిని తాగి 5 ఆసనాలు వేయాలి.

2. రెండోవసారి..మరల కూర్చొని ఒక గ్లాస్ నీటిని తాగి 5 ఆసనాలు వేయాలి.

3. మూడోవసారి..మరల కింద కూర్చుని 1 గ్లాస్ గోరు వెచ్చని నీరు తాగాలి, వెంటనే 5 ఆసనాలు చేయాలి.

4. నాల్గోవసారి.. మరల కింద కూర్చొని ఒక గ్లాస్ నీరు గోరువెచ్చని తాగి. 5 అసనములు వేయాలి.

5. ఐదోవసారి.. మరల కింద కూర్చొని ఒక గ్లాస్ నీరు తాగి. 5 ఆసనాలు చేయాలి.
ఇలా చేస్తున్నపుడు మూత్రం కానీ మలం గాని వస్తే వెంటనే వెళ్ళి రావాలి.లేకపోతే వికృత రోగాలు వస్తాయి.

తరువాత కొద్దిగా గోరువెచ్చని నీరు తాగి, కాలకృత్యములు చేసుకోవాలి. ఇక్కడ కాలకృత్యముకు చేసేటపుడు ఎక్కువ సేపు కూర్చోరాదు.

ఈ విధంగా చేస్తున్నపుడు ముందుగా మలం బయటికి వస్తుంది. ఆపైన మలం కలిసిన నీరు బయటికి వస్తుంది. తరువాత వాసనతో కూడిన చెడు నీరు వస్తుంది. తరువాత నీటితోపాటు చిన్న చిన్న ముక్కలు బయటికి వస్తాయి. చివరగా ప్రేగులు శుభ్రపడుతాయి. వీటి తరువాత “కుంజర క్రియ”చేయాలి. తరువాత “భస్ర్తీక” ప్రాణాయామం చేయాలి. తరువాత 30 నిముషాలు శవాసనం వేయాలి.

ఆ తరువాత పెసరపప్పు, బియ్యం కలిపి, కొద్దిగా పసుపు, వేసి చేసిన ఖిచిడి లో నెయ్యి ఎక్కువగా కలిపి టిఫిన్ గా చెయ్యాలి. నెయ్యి ప్రేగులకు చక్కని లేపనంగా పనిచేస్తుంది. ఇందులో ఖిచిడి కంటే నెయ్యి ఎక్కువగా ప్రాధాన్యం ఉంది. ఎందుకంటే ప్రేగులు మొత్తం ఖాళీ అయిన ప్రదేశం చక్కగా లేపనంగా పనిచేస్తుంది. ప్రేగులకు బలం ఇస్తుంది. దీనిలో ఉప్పు ఎక్కువగా వేయరాదు. నెయ్యి వేయకపోతే పైత్య రసం ప్రకోపించి జ్వరం రావచ్చును. దీని నివారణకు ఖిచిడి ఒక్కటే మార్గం. దీనికి మందు లేదు.

శంఖ ప్రక్షాళన చేసిన తరువాత కొన్ని ముఖ్యమైన విషయాలు పాటించాలి.

1. ఆకలి ఉన్న లేకపోయినా నెయ్యి కలుపుకొని ఖిచడి తినాలి. లేకపోతే ప్రేగులు బలహీనపడుతాయి.

2. ఇది తిన్న తరువాత 3 గంటల వరకు నీరు తాగరాదు.
మూడు గంటల తరువాత నీరు తాగాలి. చల్లని నీరు తాగరాదు. గోరువెచ్చని నీటిని మాత్రమే తాగాలి.

3. 3 లేదా 4 గంటల వరకు నిద్ర పోవద్దు.సాయంత్రం కూడా ఖిచిడి లో నెయ్యి వేసి తినాలి.

4. రెండు రోజుల వరకు త్వరగా జీర్ణమయ్యే సాదా ఆహారం తినాలి. మసాలా, కారం, ఉప్పు, పులుపు, పెరుగు, పాలతో తయారుచేసిన ఆహార పదార్దాలు తినరాదు.

5. శంఖ ప్రక్షాళన చేసే ముందు రాత్రి తేలికగా జీర్ణమయ్యే ఆహారం తినాలి.

6. ఇది ఏడాది లో రెండు సార్లు మాత్రమే చేయాలి.ఋతువులు మారేటపుడు సెప్టెంబరు, అక్టోబరు నెలల్లో ను… మార్చి, ఏప్రిల్ నెలల్లోనూ దీనిని చేయాలి.

7. ఇది అనుభవం ఉన్న గురువుల దగ్గర నేర్చుకోవాలి.

8. ఇలా చేయటానికి గోరువెచ్చని నీరు, ఒక యోగ మ్యాట్, ఉప్పు, నిమ్మరసం, ఒక గ్లాస్, ఖిచిడి, నెయ్యి, ఇతర మీకు కావాల్సిన వస్తువులు, మరియు శంఖ ప్రక్షాళన చేసే రోజు టాయిలెట్ కి మీరు వెంటనే పోవటానికి ఎవరు అడ్డు రాకుండా చూసుకోండి. ఒకేసారి ఇంట్లో ఇద్దరికి వస్తే ముందుగా మీరే వెళ్ళాలి, లేకపోతే మలం కిందకు జారిపడుతుంది. ఏ మాత్రమే మలం ఆగదు.

9. వదులుగా ఉన్న వస్త్రాలు ధరించాలి.

10. బలహీనంగా, నీరసంగా ఉన్నపుడు శంఖ ప్రక్షాళన చేయరాదు. ప్రేగులు వాపు ఉన్నపుడు కూడా చేయరాదు.

11. శంఖ ప్రక్షాళన చేసిన రోజు బరువు పనులు చేయరాదు. ఈ రోజు విశ్రాంతి అవసరం.

12. శంఖ ప్రక్షాళన చేసిన తరువాత అర గంట శవాసనం వేసి ఖిచిడి తినాలి. తరువాత 3 గంటలు వరకు నిద్ర పోకూడదు.

“శంఖ ప్రక్షాళన అసనములు 5 రకములుగా ఉన్నాయి.

1. తాడాసనం

2. వక్ర తాడాసనం

3. వక్ర భుజంగాసనం

4. కటి చక్రాసనం

5. ఉదరాకర్షణసనం

(ఇవి చెయ్యాలి. మిగతా భాగం పార్టు-2 లో)

-షేక్.బహర్ అలీ.
యోగచార్యుడు

 

Leave A Reply

Your email address will not be published.