సీతారామ ప్రాజెక్టుపై ముఖ్యమంత్రి సమీక్ష
హైదరాబాద్ : ఉమ్మడి ఖమ్మం జిల్లాను సస్యశ్యామలం చేసే సీతారామ ప్రాజెక్టు పనులను వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి కెసిఆర్ అధికారులను ఆదేశించారు. కొత్త ఆయకట్టును సృష్టించడంతో పాటు, నాగార్జునసాగర్ ఆయకట్టును కూడా కలుపుకుని పది లక్షల ఎకరాలకు సాగునీరు అందించే ఈ ప్రాజెక్టును అత్యంత ముఖ్యమైనదిగా భావించాలని సీఎం అన్నారు.
సీతారామ ప్రాజెక్టు పనుల పురోగతిపై సీఎం కేసీఆర్ గురువారం ప్రగతి భవన్‌లో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. అటు గోదావరి, ఇటు కృష్ణా నదుల మధ్య ఉన్న ఖమ్మం జిల్లాను సస్యశ్యామలం చేసేందుకే ప్రభుత్వం సీతారామ ఎత్తిపోతల పథకాన్ని చేపట్టిందన్నారు. దుమ్ముగూడెం పాయింట్ వద్ద గోదావరి నదిలో ఏడాది పొడవునా పుష్కలమైన నీరు అందుబాటులో ఉంటుంది. ఈ నీటి ద్వారా యావత్తు ఖమ్మం జిల్లాకు నీరు అందించవచ్చన్నారు. దుమ్ముగూడెం నుంచి నీటిని ఎత్తి పోసి అటు ఇల్లందు వైపు, ఇటు సత్తుపల్లి వైపు, మరోపక్క పాలేరు రిజర్వాయర్‌కు లిఫ్టులు, కాల్వల ద్వారా నీటిని తరలించాలన్నారు.
ఈ సమావేశంలో మంత్రులు పువ్వాడ అజయ్ కుమార్, వేముల ప్రశాంత్ రెడ్డి, సీఎస్ సోమేశ్ కుమార్, నీటిపారుదలశాఖ ముఖ్య కార్యదర్శి రజత్ కుమార్, ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణరావు, సీఎం కార్యదర్శి స్మితా సభర్వాల్, ఈఎన్‌సీలు మురళీధర్ రావు, హరేరామ్, సీఈలు వెంకట కృష్ణ, శంకర్ నాయక్, మధుసూదన్ రావు, ఎస్ఈ శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్యేలు కందాల ఉపేందర్ రెడ్డి, హరిప్రియ, సండ్ర వెంకట వీరయ్య తదితరులు పాల్గొన్నారు.