అశ్రునయనాల మధ్య ఆరుగురి అంత్యక్రియలు
గూడూరు: మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం మర్రిమిట్ట వద్ద జరిగిన ప్రమాదంలో మృతిచెందిన ఆరుగురి అంత్యక్రియలు శనివారం నిర్వహించారు. జిల్లా ఆసుపత్రిలో ఉదయం మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం కళ్యాణి, ప్రదీప్, ప్రమీల, ప్రసాద్, లక్ష్మిల మృతదేహాలను గూడూరు మండలం ఎర్ర కుంట తండాకు తీసుకెళ్లారు.
ఎర్రకుంట తండాకు చెందిన ఒకే కుటుంబంలోని ఐదుగురుపెండ్లి కూతురుకు బట్టలు, ఇతర సామగ్రి కొనేందుకు ఆటోలో వరంగల్ వెళ్తుండగా మర్రిమిట్ట వద్ద ఆటోను లారీ ఢీకొట్టి వంద మీటర్లు లాక్కెళ్లింది. ప్రమాదంలో జాటోత్ ప్రమీల (23), ప్రదీప్ (25), కల్యాణి(46), ప్రసాద్ (42), లక్ష్మి (38) తోపాటు డ్రైవర్ రాము (23) ఘటనాస్థలంలోనే దుర్మరణం చెందిన విషయం తెలిసిందే.
(మహబూబాబాద్‌లో ఆటో-లారీ ఢీ.. ఆరుగురి మృతి)
కుటుంబ సభ్యులు, బంధువులు, గ్రామస్తులు అశ్రునయనాల మధ్య వీరి అంత్యక్రియలు పూర్తిచేశారు. ఎర్రకుంటతండా శోకసంద్రంలో మునిగిపోయింది. ఆటో డ్రైవర్ రాము అంత్యక్రియలు సురేశ్ నగర్ తండాలో జరిగాయి. అంతకుముందు బాధిత కుటుంబాలను మంత్రి సత్యవతి రాథోడ్ పరామర్శించారు. ఘటన దురదృష్టకరమని ఆవేదన వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలను ఆదుకుంటామని ఆమె హామీ ఇచ్చారు.