కొనసాగుతున్న ఎమ్మెల్సీ పోలింగ్
సమస్యలు పరిష్కరించే అభ్యర్థికే ఓటు : మంత్రి కేటీఆర్
హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. తెలంగాణలోని రంగారెడ్డి-హైదరాబాద్-మహబూబ్‌నగర్, వరంగల్-నల్గొండ-ఖమ్మం శాసన మండలి పట్టభద్రుల స్థానాలకు పోలింగ్ ఉదయం 8 గంటలకు ప్రారంభమయ్యాయి. దీంతో పాటు ఆంధ్రప్రదేశ్‌లోని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలు కొనసాగుతున్నాయి. పోలింగ్ సాయంత్రం 4 గంటల వరకు కొనసాగనుంది.
సమస్యలు పరిష్కరించే అభ్యర్థికే ఓటు: మంత్రి కెటిఆర్
సమస్యలు పరిష్కరించే అభ్యర్థికే శాసన మండలి పట్టభద్రుల ఎన్నికల్లో ఓటు వేసినట్లు రాష్ట్ర పురపాలక, ఐటీశాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు తెలిపారు. ఆదివారం ఆయన షేక్‌పేటలోని తహసీల్దార్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో ఓటుహక్కును వినియోగించుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రంగారెడ్డి-హైదరాబాద్-మహబూబ్‌నగర్ ఎమ్మెల్సీ పట్టభద్రుల ఎన్నికల్లో ప్రజలకు మంచి చేయగల, సమస్యలు పరిష్కరించే అభ్యర్థికే ఓటు వేశానని చెప్పారు. తప్పకుండా విద్యావంతులంతా ఎన్నికల్లో ఓటుహక్కును వినియోగించుకోవాలని కోరారు
ఓటు హక్కు వినియోగించుకున్న ప్రముఖులు
ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్‌లో భాగంగా ప్రముఖులు ఓటుహక్కును వినియోగించుకున్నారు. హైదరాబాద్ బంజారాహిల్స్ షేక్‌పేట తహసీల్దార్ కార్యాలయంలో మంత్రి కేటీఆర్ క్యూలైన్లో బారులు తీరి ఓటుహక్కును వినియోగించుకున్నారు. ఓల్డ్ మలక్‌పేటలోని అగ్రికల్చర్ కార్యాలయంలో హోంమంత్రి మహబూబ్అలీ, మంత్రి శ్రీనివాస్‌గౌడ్ మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని గర్ల్స్ కళాశాలలోని పోలింగ్ కేంద్రంలో ఓటు వేశారు. సూర్యాపేట జిల్లాకేంద్రంలోని ప్రభుత్వ కళాశాలలో విద్యుత్‌శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి – సునీత దంపతులు, వనపర్తి జిల్లా కేంద్రంలో రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి ఓటుహక్కును వినియోగించుకున్నారు. దేవరకొండలో ఎమ్మెల్యే రవీంద్రకుమార్, మిర్యాలగూడ పట్టణంలోని బకల్‌వాడి పాఠశాలలో ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్‌రావు ఆయన కుమారుడు సిద్ధార్థతో కలిసి ఓటువేశారు. కోదాడలో ఎమ్మెల్యే మల్లయ్యాదవ్, యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో కలెక్టర్ అనితా రామచంద్రన్, మహబూబాబాద్‌లో ఎమ్మెల్యే భానోత్ శంకర్‌నాయక్ దంపతులు తమ ఓటుహక్కును వినియోగించుకున్నారు. హైదరాబాద్ తార్నాకలో ఎమ్మెల్సీ రామచందర్‌రావు ఓటుహక్కును వినియోగించుకున్నారు. హన్మకొండ ఆర్ట్స్ కాళాశాలలో బిజెపి అభ్యర్థి ప్రేమేందర్‌రెడ్డి ఓటు వేశారు. ఉప్పరపల్లిలో సిఎస్ సోమేశ్ కుమార్ తన ఎమ్మెల్సీ ఓటు వేశారు. రెడ్‌హిల్స్‌లో సైబరాబాద్ సిపి సజ్జనార్ దంపతులు ఓటు వేశారు. మాదాపూర్ పోలింగ్ కేంద్రంలో ఎంపీ కెప్టెన్ వీ లక్ష్మీకాంత్‌రావు, బంజారాహిల్స్‌లో నగర మేయర్ విజయలక్ష్మి ఓటు వేశారు.