కీసరలో 36, కామారెడ్డిలో 32, నాగోల్‌లో 18 మందికి కరోనా..
హైదరాబాద్: తెలంగాణలో మళ్లీ కరోనా విజృంభిస్తోంది. రాష్ట్రంలోని పలు పాఠశాలలో కరోనా సోకింది. నిన్న మంచిర్యాల పట్టణంలోని బాలికల ఉన్నత పాఠశాలలో కరోనా కలకలం రేపింది. తాజాగా మేడ్జల్ జిల్లా కీసరలోని మైనార్టీ గురుకుల పాఠశాలలో 36 మంది బాలికలకు కరోనా సోకినట్లు అధికారులు గుర్తించారు. అలాగే కామారెడ్డిలోని టేక్రియాల్ కస్తూర్భా గాంధీ విద్యాలయంలో 32 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. అక్కడ విద్యార్థులు, సిబ్బందితో కలపి 140 మందికి కొవిడ్ పరీక్షలు నిర్వహించగా 32 మందికి కరోనా సోకినట్లు కామారెడ్డి జిల్లా వైద్యాధికారి డాక్టర్ చంద్రశేఖర్ తెలిపారు. జిల్లాలో ప్రత్యేక మొబైల్ వైద్య బృందాల ద్వారా అన్ని వసతి గృహాలు, పాఠశాలలో కరోనా పరీక్షలు నిర్వహించేందుకు ప్రత్యేక కార్యాచరణ అమలు చేస్తున్నట్లు ఆయన తెలిపారు.
హైదరాబాద్‌లో నాగోల్‌లో కరోనా కలకలం.. 18 మంది విద్యార్థినిలకు పాజిటివ్..
అలాగే నాగోల్ బండ్లగూడలోని మైనార్టీ వెల్ఫేర్ హాస్టల్లో ఒకే సారి భారీ సంఖ్యలో కోవిడ్ కేసులు వెలుగు చూడడం సంచలనంగా మారింది. మైనార్టీ వెల్ఫేర్ హాస్టల్లో ఇప్పటి వరకు ఏకంగా 18 మంది విద్యార్థినులకు కరోనా పాజిటివ్‌గా తేలింది. దీంతో.. అప్రమత్తమైన అధికారులు.. విద్యార్థులు, స్టాఫ్‌కు కూడా టెస్టులు చేసే పనిలో పడిపోయారు. ఇంకా ఎంతమందికి కరోనా పాజిటివ్‌గా తేలుతుందోననే టెన్షన్ మొదలైంది.