వర్షం వస్తే.. అధికారులంతా రోడ్లమీద ఉండాల్సిందే.. సిఎం రేవంత్‌రెడ్డి
హైదరాబాద్ (CLiC2NEWS): వర్షాలు, ప్రకృతి విపత్తులపై సిఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. వర్షాకాలం ప్రారంభం కావడంతో నగరంలో జరిగే పరిణామాల దృష్ట్యా ఉన్నతాధికారులతో చర్చించారు. హైదరాబాద్ నగరంలో వర్షాకాలంలో తీసుకోవాల్సిన ముందస్తు చర్యలపై ఆయన అధికారులకు పలు సూచనలు చేశారు. మున్సిపల్ , పోలీసు సిబ్బంది మధ్య సమన్వయం కొరవడిందని.. ఈ నెల 9 వ తేదీన వర్షం పడినపుడు అధికరారులు సరిగా పనిచేయలేదని సిఎం అన్నారు. రాష్ట్రంలోని ప్రాజెక్టుల నిర్వహణ మాన్యువల్ ప్రకారం జరగాలని, సిఇలు, ఎస్ ఇలు స్థానికంగా ఉండాలని స్పష్టం చేశారు. ప్రాజెక్టుల నిర్వహణ, గేట్ల మరమ్మతులకు తక్షణమే నిధులు విడుదల చేయాలని సిఎం ఆదేశించారు. నీరు నిలిచే ప్రాంతాలు, బ్లాక్‌స్పాట్ల డేటా ఆధారంగా పనిచేయాలన్నారు. విద్యుత్ శాఖ పూర్తి స్థాయిలో సన్నద్దం కావాలని, ఫీల్డ్‌లో ఉండని అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. వర్షం వచ్చిందంటే.. ఉన్నతాధికారుల నుండి కింది స్థాయి సిబ్బంది వరకు అందరూ రోడ్లపైనే ఉండాలని, అవసరమైతే నేనూ వస్తానని సిఎం రేవంత్ రెడ్డి అన్నారు.
Also Read: వ్యాను బావిలోకి దూసుకెళ్లి.. ఘోర ప్రమాదం