సుప్రీం `పీఠం`పై తెలుగు తేజం:

సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఎన్వీ రమణ.. ఉత్తర్వులు జారీ

న్యూఢిల్లీ: భార‌త 48వ ప్ర‌ధాన న్యాయ‌మూర్తిగా తెలుగు వ్య‌క్తి జ‌స్టిస్ నూత‌ల‌పాటి వెంక‌ట ర‌మ‌ణ బాధ్య‌త‌లు చేప‌ట్ట‌నున్నారు. ఈమేర‌కు సుప్రీం కోర్టు త‌దుప‌రి సిజెగా జ‌స్టిస్ ర‌మ‌ణ పేరు ప్ర‌తిపాదిస్తూ ప్ర‌స్తుత సిజెఐ జ‌స్టిస్ ఎస్ ఎ బోబ్డే కేంద్ర న్యాయ‌శాఖ‌కు సిఫార్సు చేశారు. ఈ ప్ర‌తిపాద‌న‌ల‌ను న్యాయ‌శాఖ.. రాష్ట్రప‌తి రామ‌నాథ్ కోవింద్‌కు పంప‌గా ఆయ‌న ఆమోద ముద్ర వేశారు. జ‌స్టిస్ ఎన్వీ ర‌మ‌ణ‌ను ప్ర‌ధాన న్యాయ‌మూర్తిగా నియ‌మిస్తూ రాష్ట్రప‌తి ఉత్త‌ర్వులు జారీ చేశారు. సుప్రీం కోర్టు ప్ర‌ధాన న్యాయ‌మూర్తిగా నియ‌మితుల‌య్యే రెండో తెలుగు వ్య‌క్తి జ‌స్టిస్ ర‌మ‌ణ కావ‌డం విశేషం.

48 వ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఎన్వీ రమణ ఆగష్టు 26, 2022 వరకు కొనసాగనున్నారు. ఏప్రిల్ 24వ తేదీన ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఎన్వీ రమణ ప్రమాణస్వీకారం చేయబోతున్నారు. 2014 ఫిబ్రవరి 17 వ తేదీన ఎన్వీ రమణ సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా ఎంపికయ్యారు. అంతకు ముందు ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేశారు.

బాల్యము

ఆంధ్ర ప్రదేశ్ లోని కృష్ణా జిల్లా లోని పొన్నవరం గ్రామంలో 1957 ఆగస్టు 27 న వ్యవసాయ కుటుంబంలో జన్మించారు. గణపతిరావు, సరోజిని ఆయన తల్లిదండ్రులు. ఆయన కంచికర్లలో ఉన్నత పాఠశాల విద్యాభ్యాసం పూర్తిచేసి, అమరావతి లోని ఆర్.వి.వి.ఎన్.కాలేజీలో బి.యస్సీలో పట్టా పొందారు. 1982 లో నాగార్జున విశ్వవిద్యాలయంలో న్యాయశాస్త్రంలో పట్టా తీసుకొని 1983 ఫిబ్రవరి 10 న రాష్ట్ర బార్ కౌన్సిల్ లో న్యాయవాదిగా నమోదై న్యాయవాదిగా వృత్తి ప్రారంభించారు.

న్యాయ వృత్తి

1983 ఫిబ్రవరి 10న న్యాయవాదిగా ఎన్‌రోల్ అయ్యారు. హైకోర్టుతో పాటు కేంద్ర, రాష్ట్ర పరిపాలనా ట్రిబ్యునళ్లలో ప్రాక్టీస్ చేశారు. సుప్రీంకోర్టులో కూడా కేసులు వాదించారు. రాజ్యాంగపరమైన, క్రిమినల్, సర్వీస్, అంతర్రాష్ట్ర నదీ జలాల సంబంధిత కేసుల వాదన ఆయన ప్రత్యేకత. పలు ప్రభుత్వ సంస్థలకు ప్యానల్ అడ్వకేట్‌గా వ్యవహరించారు. కేంద్ర ప్రభుత్వ అదనపు స్టాండింగ్ కౌన్సిల్‌గా పనిచేశారు. అదనపు అడ్వకేట్ జనరల్‌గానూ బాధ్యతలు నిర్వర్తించారు. 2000 జూన్ 27న హైకోర్టు శాశ్వత న్యాయమూర్తిగా నియమితులయ్యారు. దేశ, విదేశాల్లో జరిగిన పలు న్యాయసదస్సుల్లో జస్టిస్ రమణ ప్రసంగించారు. ఆంధ్రప్రదేశ్ జ్యుడీషియల్ అకాడమీ ప్రెసిడెంట్‌గా, రాష్ట్ర న్యాయసేవాధికార సంస్థ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్‌గా ఉన్నారు.. హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా కూడా బాధ్యతలు నిర్వర్తించారు.

ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా

ఢిల్లీ చీఫ్ జస్టిస్ గా పనిచేసిన డి మురుగేశన్ జూన్ లో పదవీ విరమణ పొందడంతో ఆయన స్థానంలో జస్టిస్ రమణను ప్రధాన న్యాయమూర్తిగా భారత ప్రధాన న్యాయమూర్తి పి. సతాశివం నేతృత్వంలోని సుప్రీంకోర్టు కొలీజియం సిఫారసు చేసింది. ఈ మేరకు 2013 సెప్టెంబరు 2 సోమవారం రోజు, రాజ్ నివాస్ లో ఆడంబరంగా జరిగిన ఓ కార్యక్రమంలో లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్ చేతుల మీదుగా జస్టిస్ రమణ ప్రమాణ స్వీకారం చేశారు.

సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా

2014 ఫిబ్రవరి 7 న సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. జస్టీస్ చలమేశ్వర్ సుప్రీం కోర్టులో న్యాయ మూర్తిగా చేసి రిటైర‌య్యారు.. ప్ర‌స్తుతం వెంకట రమణ సుప్రీం కోర్టు సీనియ‌ర్ న్యాయ మూర్తిగా కొన‌సాగుతున్నారు. 1966 జూన్ 30 నుండి 1967 ఏప్రిల్ 11 వరకు మరో తెలుగు వ్యక్తి కోకా సుబ్బారావు సుప్రీం కోర్ట్ ప్రధాన న్యాయ మూర్తిగా బాధ్యతలను నెరవేర్చారు.

Leave A Reply

Your email address will not be published.