ఆక్సిజన్ సరఫరాకు ప్రత్యేక రైళ్లు..
న్యూఢిల్లీ: లిక్విడ్ మెడికల్ ఆక్సిజన్, ఆక్సిజన్ సిలిండర్లను రవాణా చేయడానికి కొన్నాళ్ల పాటు ‘ఆక్సిజన్ ఎక్స్‌ప్రెస్’లను నడుపుతామని రైల్వే శాఖ ఆదివారం తెలిపింది. మెడికల్ ఆక్సిజన్‌కు డిమాండ్ పెరుగుతున్న నేపత్యంలో ఈ రైలు ద్వారా డిమాండ్ ఉన్న చోటుకు ఆక్సిజన్న సరఫరా చేయనున్నట్లు అధికార వర్గాలు వెల్లడించారయి. ముంబయిలోని కలంబోలీ, ముంబైకి 120 కిలోమీటర్ల దూరంలోని బొయీసర్ రైల్వే స్టేషన్ల నుంచి రోడ్ ట్యాంకర్లను ఫ్లాట్ వ్యాగన్లపై ఎక్కించి విశాఖ, జంషెడ్పూర్, రూర్కెలా, బొకారొకు సోమవారం తరలించనున్నట్టు అధికారులు తెలిపారు. అక్కడ ట్యాంకర్లలో మెడికల్ ఆక్సిజన్‌ను లోడ్ చేశాక తిరిగి ప్రయాణమవుతాయి. రైళ్లలో మెడికల్ ఆక్సిజన్ ట్యాంకర్ల రవాణాకు గల అవకాశాన్ని పరిశీలించాలని మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ ప్రభుత్వాలు ఇటీవల కేంద్రాన్ని కోరాయి.
గత ఏడాది కేంద్ర ప్రభుత్వంలోని వివిధ మంత్రిత్వ శాఖలు తమ పరిధిలోని ఆసుపత్రుల్లో కొవిడ్ పడకలు ఏర్పాటు చేసిన విషయాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ సారి అదే తరహా సాయం అందించాలని కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి రాజేష్ భూషన్ వివిధ శాఖలను కోరారు. ఈ మేరకు రక్షణ, రైల్వే, ఉక్కు, బొగ్గు, విద్యుత్తు, నౌకాయానం, విద్యాశాఖ కార్యదర్శులకు లేఖలు రాశారు. అవకాశమున్న చోట ఆక్సిజన్, ఐసీయూ బడ్లు, వెంటిలేటర్లు, లేబోరేటరీ సేవలు అందుబాటులోకి తేవాలని కోరారు.