కరోనా ఎఫెక్ట్: ఢిల్లీలో 6రోజులు లాక్డౌన్
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో కరోనా వైరస్ రెండో దశ ఉధృతి తీవ్ర రూపం దాల్చిన నేపథ్యంలో కేజ్రీవాల్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ఢిల్లీలో ఆరు రోజుల పాటు పూర్తి స్థాయి లాక్ విధిస్తున్నట్లు ఢిల్లీస సిఎం కేజ్రీవాల్ ప్రకటించారు. ఇవాళ (సోమవారం) రాత్రి 10 గంటల నుంచి వచ్చే సోమవారం ఉదయం 5 గంటల వరకు లాక్డౌన్ అమలులో ఉంటుందన్నారు. ఢిల్లీలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు ఆందోళన కలిగిస్తున్నాయి. నిన్న ఒక్క రోజే ఆ నగరంలో 25 వేల కేసులు నమోదు అయ్యాయి. నగరంలో ఆరోగ్య వ్యవస్థ చాలా వత్తిడికి లోను అయ్యిందని, వ్యవస్థ కుప్పకూలకుండా ఉండేందుకు కఠిన చర్యలు తప్పవని సీఎం కేజ్రీవాల్ తెలిపారు. లాక్డౌన్ పొడిగించరాదు అని భావిస్తున్నట్లు ఆయన చెప్పారు. ఇవాళ అర్థరాత్రి నుంచి లాక్డౌన్ మొదలవుతుంది.
లాక్డౌన్ సమయంలో…
ఢిల్లీలో గత నాలుగు రోజులుగా వైరస్ ఉధృతంగా కొనసాగుతోంది. ఒకే రోజే 25వేల కేసులు నమోదు అయ్యాయని, ఢిల్లీ ఆరోగ్య వ్యవస్థపై వత్తిడి పెరిగిందని, ప్రస్తుతం వ్యవస్థ కుప్పకూలలేదు, కానీ వత్తిడి పెరిగిందన్నారు. నగరంలో పాజిటివిటీ రేటు, ఇన్ఫెక్షన్ రేటు పెరిగిందన్నారు. ఒకే రోజు 25వేల మంది రోగులు హాస్పిటల్కు వస్తే అప్పుడు అది సమస్య అవుతుందని, ఢిల్లీలో బెడ్స్ కొరత ఉన్నట్లు ఆయన చెప్పారు. అత్యవసర సేవలు, ఫుడ్ సర్వీసెస్, మెడికల్ సర్వీఎస్ కొనసాగుతాయన్నారు. పెండ్లిల్లు కేవలం 50 మందితో నిర్వహించుకోవాలన్నారు. ఆ వేడుకల కోసం ప్రత్యేక పాస్లు ఇస్తామన్నారు.

వారికి చేతులెత్తి మొక్కుతున్నా..
రానున్న ఆరు రోజుల్లో ఢిల్లీ హాస్పిటళ్లలో బెడ్స్ సంఖ్యను పెంచుతామన్నారు. తమకు సాయం చేస్తున్న కేంద్ర ప్రభుత్వానికి థ్యాంక్స్ చెప్పారు. లాక్డౌన్ సమయంలో ఆక్సిజన్, మందులు ఏర్పాటు చేసుకుంటామన్నారు. ప్రతి ఒక్కరూ మార్గదర్శకాలను పాటించాలని కోరారు. వలస కూలీలకు కేజ్రీవాల్ప్రత్యేకంగా అభ్యర్థన చేశారు. వారికి చేతులెత్తి మొక్కుతున్నా.. ఇది చిన్న లాక్డౌన్ మాత్రమే. దయచేసి ఢిల్లీ వదిలి ఎవరూ వెళ్లొద్దు.. మళ్లీ దీన్ని పొడిగించాల్సిన అవసరం రాదని నేను భావిస్తున్నా.. “ అని కేజ్రీవాల్ భరోసా కల్పించారు.