COVID-19 Vaccine: `కొవిన్‌`లో నమోదైతేనే వ్యాక్సిన్‌..

‘ఆరోగ్యసేతు’లోనూ రిజిస్ట్రేషన్‌.. శనివారం నుంచి 18+ వారికి టీకా.. బుధవారం నుంచి రిజిస్ట్రేషన్‌

న్యూఢిల్లీ (CLiC2NEWS): దేశంలో క‌రోనా మ‌హ‌మ్మారి సెకండ్ వేవ్ ఉధృతంగా కొన‌సాగుతున్న నేప‌థ్యంలో వ్యాక్సినేషన్‌ ప్రక్రియను కేంద్రప్రభుత్వం వేగవంతం చేసింది. ఈ క్ర‌మంలో 18 సంవ‌త్స‌రాలు పైబడిన వారందరికీ మే 1 వ తేదీ నుంచి వ్యాక్సిన్‌ వేయనున్నట్టు ప్రకటించిన సంగ‌తి తెలిసిందే. అయితే, ‘కొవిన్‌’ వెబ్‌ పోర్టల్‌లో పేర్లను నమోదు చేసుకొని, స్లాట్‌ బుక్‌ చేసుకున్న వారికి మాత్రమే టీకాను వేస్తామని ఆదివారం అధికార వర్గాలు వెల్లడించాయి. స్పాట్‌ రిజిస్ట్రేషన్లను ఎంతమాత్రం అనుమతించబోమని తెలిపాయి.

18 ఏండ్లు పైబడిన అందరికీ టీకాల కార్యక్రమం మొదలవ్వగానే వ్యాక్సిన్‌ కోసం పెద్దఎత్తున ప్రజలు తరలివచ్చే అవకాశమున్నదని, దీంతో గందరగోళ పరిస్థితులు తలెత్తవచ్చని అధికారి ఒకరు పేర్కొన్నారు. అలాంటి పరిస్థితులు ఎదురవ్వకుండా ఉండేందుకే, 18-44 ఏండ్ల వయసువారు టీకా కోసం రిజిస్ట్రేషన్‌ చేసుకోవడాన్ని తప్పనిసరి చేసినట్టు తెలిపారు.

ఏప్రిల్‌ 28 (బుధవారం) నుంచి 18 ఏండ్లు పైబడిన వారు టీకా కోసం రిజిస్ట్రేషన్‌ చేసుకోవచ్చు. ‘కొవిన్‌’ వెబ్‌ పోర్టల్‌ లేదా ‘ఆరోగ్యసేతు’ యాప్‌లో వివరాలు నమోదు చేసుకొని స్లాట్‌ బుక్‌ చేసుకోవచ్చు.

18-44 ఏండ్ల వయసు వారి కోసం శనివారం నుంచి మూడోదశ వ్యాక్సినేషన్‌ ప్రారంభం కానున్నది. అయితే, వేసుకునే టీకా, కేంద్రాన్ని ఎంచుకునే సదుపాయం ప్రజలకు కల్పించబోతున్నట్టు ప్రభుత్వం వెల్లడించింది. పేర్లను నమోదు చేసుకునే సమయంలోనే ‘కొవిన్‌’ పోర్టల్‌లో వ్యాక్సిన్‌ పేరు, ధర, టీకా కేంద్రం (ప్రభుత్వ, ప్రైవేట్‌) వంటి వివరాలు కనిపిస్తాయని, వాటిని అనుసరించి రిజిస్ట్రేషన్‌ను చేసుకోవాలని సూచించింది.

వ్యాక్సినేషన్‌కి అర్హులు: 18 ఏండ్లు పైబడినవారు

రిజిస్ట్రేషన్‌ ప్రారంభం: బుధవారం (ఏప్రిల్‌ 28)

పేర్ల నమోదు వేదికలు: కొవిన్‌ పోర్టల్‌, ఆరోగ్యసేతు యాప్‌

వ్యాక్సినేషన్‌ ప్రారంభం: శనివారం (మే 1)

`కొవిన్‌` పోర్టల్‌లో రిజిస్టర్‌ అవ్వండిలా..

  • www.cowin.gov.in పోర్టల్‌లోకి లాగిన్‌ అవ్వాలి.
  • మొబైల్‌ నంబర్‌ను నమోదు చేయాలి.
  • మొబైల్‌కు ఓటీపీ వస్తుంది.
  • వచ్చిన ఓటీపీని నమోదు చేసి వెరిఫై బటన్‌ను క్లిక్‌ చేయాలి.
  • ఆధార్‌, ఓటర్‌ ఐడీ వంటి ఏదైనా ఫొటో ఐడీ ప్రూఫ్‌ కోసం దేన్నైనా ఎంచుకోవాలి.
  • పేరు, వయసు, లింగం తదితర వివరాలు నమోదుచేపి ఐడీ సాఫ్ట్‌కాపీని అప్‌లోడ్‌ చేయాలి.
  • రిజిస్టర్‌ బటన్‌ను క్లిక్‌ చేయాలి.
  • రిజిస్ట్రేషన్‌ విజయవంతంగా పూర్తవ్వగానే, పేజీలో మీ అకౌంట్‌ వివరాలు కనిపిస్తాయి.
  • కిందనున్న షెడ్యూల్‌ అపాయింట్‌మెంట్‌ బటన్‌ను నొక్కాలి.
  • రాష్ట్రం, జిల్లా, బ్లాక్‌, పిన్‌కోడ్‌ ఆధారంగా టీకా కేంద్రాన్ని ఎంచుకోవచ్చు.
  • రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటుచేసిన టీకా కేంద్రాలతో పాటు, ప్రైవేటు దవాఖానలు ఏర్పాటు చేసిన టీకా కేంద్రాల వివరాలు కనిపిస్తాయి.
  • తేదీ, టీకా వయల్స్‌, ధరకు సంబంధించిన వివరాలు కనిపిస్తాయి.
  • నచ్చిన టీకా, ప్రాంతంను బట్టి అపాయింట్‌మెంట్‌ను బుక్‌ చేసుకోవాలి.
  • అనంతరం అపాయింట్‌మెంట్‌ వివరాలతో ఫోన్‌కి సందేశం వస్తుంది.

ఆరోగ్యసేతులో రిజిస్ట్రేషన్‌ ఇలా..

  • గూగుల్‌ ప్లేస్టోర్‌ నుంచి ఆరోగ్యసేతు యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవాలి.
  • హోం పేజీలోని ‘కొవిన్‌’ ట్యాబ్‌పై క్లిక్‌ చేయాలి.
  • క్లిక్‌ చేయగానే నాలుగు ఆప్షన్స్‌ కనిపిస్తాయి.
  • అందులో వ్యాక్సినేషన్‌ ట్యాబ్‌పై క్లిక్‌ చేయాలి.
  • ఆ తర్వాత ‘రిజిస్టర్‌ నౌ’పై క్లిక్‌ చేయాలి.
  • మొబైల్‌ నంబర్‌ను నమోదు చేయాలి. (త‌రువాత‌.. ‘కొవిన్‌’ పోర్టల్‌లో అనుసరించిన విధానాన్నే పాటించాలి)
Leave A Reply

Your email address will not be published.