జగన్ కేసు: కౌంటర్ దాఖలుకు ఇదే చివరి అవకాశం
హైదరాబాద్ (CLiC2NEWS): ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ బెయిల్ రద్దు చేయాలంటూ.. నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణరాజు దాఖలు చేసిన పిటిషన్పై విచారణ మరోసారి వాయిదా పడింది. కౌంటర్ దాఖలు చేయాలని జగన్కు సీబీఐకి కోర్టు నోటీసులు జారీ చేసింది. కౌంటర్ దాఖలు చేసేందుకు ఇప్పటికే పలుమార్లు అవకాశం ఇచ్చిన సీబీఐ కోర్టు మరోసారి అవకాశం ఇచ్చింది. జూన్ 1 వ తేదీన కౌంటర్ దాఖలు చేయాలని, 1 వ తేదీన కౌంటర్ దాఖలు చేయకుంటే నేరుగా విచారణ చేపడతామని హెచ్చరించింది.
కౌంటర్ దాఖలుకు జగన్, సిబిఐ తరఫు న్యాయవాదులు మరోసారి గడువు కోరారు. లాక్డౌన్ తదితర కారణాల వలన కౌంటర్ దాఖలు చేయలేకపోయినట్టు జగన్ తరపు న్యాయవాదులు పేర్కొన్నారు.
కౌంటర్ సిద్ధంగా ఉంటే మెయిల్ ద్వారా సమర్పించవచ్చని ఉద్దేశపూర్వకంగానే జాప్యం చేస్తూ రఘురామను వేధిస్తున్నారని ఆయన తరఫు న్యాయవాది వెంకటేశ్ అన్నారు. మరోసారి గడువును ఇవ్వొద్దని.. జరిమానా విధించాలని న్యాయస్థానాన్ని కోరారు.
ఇరుపక్షాల వాదనలు విన్న సిబిఐ కోర్టు.. కౌంటర్ దాఖలు చేసేందుకు జగన్, సిబిఐకి చివరి అవకాశం ఇచ్చింది. కౌంటర్ దాఖలు చేయకుంటే నేరుగా విచారణ చేపడతామని హెచ్చరించింది. తదుపరి విచారణను జూన్ 1వ తేదీకి వాయిదా వేసింది.