Modi: 18 ఏళ్లు పైబ‌డిన అంద‌రికీ ఉచితంగా వ్యాక్సిన్‌

కోవిడ్‌ వ్యాక్సినేషన్‌పై కేంద్రం కీలక నిర్ణయం

న్యూఢిల్లీ (CLiC2NEWS): క‌రోనా మ‌హ‌మ్మారి నివార‌ణ‌కు కీల‌క అస్త్రమైన వ్యాక్సినేష‌న్‌పై కేంద్రం కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. ఈ నెల 21 నుంచి 18 ఏళ్లు పైబడిన వారందరికీ ఉచితంగా టీకాలు  కేంద్రమే అందిస్తుందని ప్రధాని నరేంద్ర మోడీ తెలిపారు. ఇందుకు సంబంధించిన కొత్త మార్గదర్శకాలను మరో రెండు వారాల్లో విడుదల చేస్తామని పేర్కొన్నారు. కేంద్ర‌మే టీకాలు కొనుగోలు చేసి రాష్ట్రాల‌కు ఇస్తుంద‌ని రాష్ట్రాలు రూపాయి కూడా ఖ‌ర్చు చేయాల్సిన అవ‌స‌రం లేద‌న్నారు. ఈ మేర‌కు సోమవారం సాయంత్రం జాతిని ఉద్దేశించి  ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ ప్ర‌సంగించ‌రు. ఈ సంద‌ర్భంగా ప్ర‌ధాని మాట్లాడుతూ కొవిడ్ వ్యాక్సినేష‌న్ బాధ్య‌త పూర్తిగా కేంద్రానిదే అని స్ప‌ష్టం చేశారు.

న‌వంబ‌ర్ నాటికి 80శాతం మందికి వ్యాక్సినేష‌న్‌

జూన్‌ 21 నుంచి 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరికీ ఉచిత వ్యాక్సిన్లు వేస్తామని అన్నారు. ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో రూ.150 మాత్రమే సర్వీస్‌ ఛార్జీ తీసుకోవాలని ఆదేశించారు. కరోనాతో యుద్ధంలో భారత్ గెలుస్తుందని, నవంబర్‌ నాటికి 80 శాతం వ్యాక్సినేషన్‌ పూర్తి చేస్తామని చెప్పారు.

ఆక్సిజ‌న్ ఉత్ప‌త్తి 10 రెట్లు పెంచాం..

“క‌రోనా మ‌హ‌మ్మారి సెకండ్ వేవ్‌తో భార‌త్ క‌ఠిన పోరాటం చేస్తోంది. క‌రోనా వ‌ల్ల ఎంతో మంది ఆప్తుల‌ను కోల్పోయారు. ఇలాంటి మ‌హమ్మారి గ‌తంలో ఎప్పుడూ చూడ‌లేదు. విన‌లేదు.దేశంలో ఆక్సిజ‌న్ ఉత్ప‌త్తిని 10 రెట్లు పెంచాం. ఆక్సిజ‌న్ స‌ర‌ఫ‌రాకు వైమానిక, నౌకా, రైల్వే సేవ‌లు వినియోగించుకుంటున్నాం.“అని మోడీ చెప్పారు.

దీపావ‌ళి వ‌ర‌కు పిఎం గ‌రీభ్ క‌ళ్యాణ్ అన్న‌దాన యోజ‌న..

దీపావళి వరకు పీఎం గరీభ్‌ కళ్యాణ్‌ అన్నదాన యోజన పథకం కొనసాగుతుందని, పేద ప్రజలకు ప్రభుత్వం అండగా ఉంటుందని అన్నారు. ఎవరూ ఆకలితో బాధపడొద్దనే ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని పేర్కొన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, కరోనాకు సంబంధించిన అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని మోడీ సూచించారు.

Leave A Reply

Your email address will not be published.