శాసన సభ సభ్యాత్వానికి ఈటల రాజీనామా
హుజూరాబాద్‌లో కౌరవులు, పాండవులకు మధ్య యుద్ధం: ఈటల రాజేందర్
హైదరాబాద్ (CLiC2NEWS): మాజీ మంత్రి ఈటల రాజేందర్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్ ఎస్)కు గుడ్‌బై చెప్పిన ఆయన తాజాగా శాసన సభ్యత్వానికి రాజీనామా చేశారు. శామీర్‌పేటలోని తన ఇంటినుంచి మద్దతుదారులతో కలిసి ముందుగా గన్‌పార్క్ చేరుకొని అమరవీరుల స్థూపానికి నివాళి అర్పించారు. అనంతరం అసెంబ్లీలోని స్పీకర్ కార్యాలయానికి వెళ్లి ఎమ్మెల్యే పదవికి ఈటల రాజీనామా లేఖను సమర్పించారు. స్పీకర్ ఫార్మేట్లో ఉన్న తన రాజీనామా లేఖను అసెంబ్లీ కార్యదర్శికి ఈటల అందజేశారు.

ఈ సందర్భంగా ఈటల మాట్లాడుతూ.. 17 ఏళ్లుగా ఎమ్మెల్యేగా కొనసాగానని.. ఇప్పుడు రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నానని ఈటల రాజేందర్ తెలిపారు. టిఆర్ ఎస్ బి-ఫారం ఇచ్చి ఉండొచ్చు…కానీ గెలిపించింది ప్రజలే అని అన్నారు. హుజూరాబాద్‌లో కౌరవులు, పాండవులకు మధ్య యుద్ధం జరగబోతోందని అన్నారు. తెలంగాణకోసం ఎన్నో పోరాటాలు చేశానని గుర్తు చేశారు. సమైక్య పాలకులపై శాసన సభలో గర్జించానని తెలిపారు. కరోనా మహమ్మారితో ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నా సర్కార్ పట్టించుకోవడం లేదని ఈ సందర్భంగా విమర్శించారు.
