హైదరాబాద్‌లో దంచికొడుతున్న వర్షం
హైదరాబాద్ (CLiC2NEWS): అల్పపీడనం ప్రభావంతో తెలంగాణ రాష్ట్రలోని పలు ప్రాంతాల్లో భారీ వానలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించిన విషయం తెలిసిందే. ఈ వర్షాలు మరో రెండు రోజుల పాటు కురుస్తాయని అధికారులు చెబుతున్నారు. రాష్ట్ర ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. రాజధాని హైదరాబాద్‌లోనే కాకుండా పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి.
తాజాగా హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో వర్షం దంచికొడుతోంది. ఇవాళ (సోమవారం) సాయంత్రం నగరంలోని పలు చోట్ల కుండపోతగా కురుస్తున్న వర్షాలకు జనాలు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, పంజాగుట్ట, అమీర్ పేట్, కూకట్ పల్లి, మాదాపూర్, మెహిదీపట్నం తదితర ప్రాంతాల్లో భారీ వాన కురుస్తోంది.
వర్షంతో రోడ్లపైకి భారీగా వరద నీరు వచ్చి చేరడంతో పలుచోట్ల ట్రాఫిక్ నిలిచిపోయింది. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొన్ని చోట్ల వర్షపు నీరు ఇళ్లలోకి వచ్చి చేరింది.