AP: గ్రామ ప్రగతిపై అధికారులకు దిశా నిర్ధేశం
డిజిటల్ లైబ్రరీలన్నీ ఈ ఏడాదే పూర్తి కావాలి: సిఎం జగన్
అమరావతి (CLiC2NEWS): గ్రామ సచివాలయాలు, విలేజ్ క్లినిక్స్, డిజిటల్ లైబ్రరీలు అన్నీకూడా ఈ ఏడాదే పూర్తి చేయాలని ఎపి సిఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారులను ఆదేశించారు. జియో ట్యాగింగ్ చేసి నిర్మాణాల తీరుపై సమీక్ష చేయాలని తెలిపారు. పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖల్లో పలు కార్యక్రమాలపై మంగళవారం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి జగన్ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వైఎస్సార్ జగనన్న కాలనీల్లో మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించి ప్రాధాన్యక్రమంలో పనులు చేపట్టాలన్నారు. పల్లెలను పరిశుభ్రంగా ఉంచే కార్యక్రమానికి పెద్దపీట వేయాలని అధికారులకు సీఎం జగన్ సూచించారు.

గ్రామాల్లో 14వేల ట్రైసైకిళ్లు ఏర్పాటుకు సీఎం వైఎస్ జగన్ అంగీకారం తెలిపారు. అలాగే అర్బన్ ప్రాంతాలకు సమీపంలో ఉన్న పల్లెల్లో 1034 ఆటోలు ఏర్పాటు, వాటితోపాటు మరిన్ని వాహనాలను కొనుగోలుకు సీఎం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. అలాగే లక్ష మందికి పైగా రైతులకు ఉపయోగపడే వైఎస్సార్ జలకళ ప్రాజెక్టుపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని ముఖ్యమంత్రి అధికారులకు సూచించారు. చిన్నచిన్న నదులపై ఉన్న బ్రిడ్జిల వద్ద చెక్‌డ్యామ్ తరహాలో నిర్మాణాలు చేపట్టాలని, కనీసం 3, 4 అడుగుల మేర అక్కడ నీరు నిల్వ ఉండేలా చేయాలని సీఎం అధికారులను ఆదేశించారు. ఈ సమీక్ష సమావేశానికి రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఉన్నతాధికారులు హాజరయ్యారు.