పోలవరం ప్రాజెక్టు అభివృద్ధి పనులను పరిశీలించిన జగన్
పోలవరం పనుల పురోగతిపై సీఎం జగన్ సమీక్ష
పోలవరం (CLiC2NEWS): ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పోలవరం ప్రాజెక్టు పర్యటనకు వెళ్లారు. సోమవారం ప్రాజెక్టు పురోగతిని తెలుసుకునేందుకు పోలవరం పరిసరాల్లో ఏరియల్వ్యూ నిర్వహించారు. అనంతరం క్షేత్రస్థాయిలో ఇప్పటివరకు జరిగిన ప్రాజెక్ట్ పనుల పురోగతిని సీఎంకు అధికారులు వివరించారు. పోలవరం నిర్వాసితులతో మాట్లాడిన ముఖ్యమంత్రి స్పిల్వే, అప్రోచ్ ఛానల్ను పరిశీలించిన తర్వాత పోలవరం పనుల ఫొటో గ్యాలరీని వీక్షించారు. పనుల తీరును ఈఎన్సి నారాయణరెడ్డి సిఎంకు వివరించారు.

అనంతరం పోలవరం ఆర్అండ్ఆర్పై సమీక్ష నిర్వహించిన ముఖ్యమంత్రి ఆర్ అండ్ ఆర్ పనులు వేగవంతం చేయాలని ఆదేశించారు.
“ఆర్ అండ్ ఆర్ పనులపై దృష్టి పెట్టాలి. ఆర్ అండ్ ఆర్ పనులు పూర్తి నాణ్యతతో ఉండాలి. కచ్చితంగా నాణ్యత పాటించేలా అధికారిని నియమించాలి. కాలనీల నిర్మాణంతో పాటు మౌలిక సదుపాయాలు కల్పించాలి. వరదల సమయంలో నిర్వాసితులకు పునరావాసం ఏర్పాటు చేయాలి. అనుకున్న లక్ష్యంలోగా ప్రాజెక్ట్ను పూర్తి చేయాలని“అని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు.