ట్రాక్టర్ నడుపుతూ.. పార్లమెంట్‌కు రాహుల్ గాంధీ
న్యూఢిల్లీ (CLiC2NEWS): పార్లమెంట్ వర్షాకాల సమావేశాలకు హాజరయ్యేందుకు కాంగ్రెస్ నాయకుడు, ఎంపి రాహుల్ గాంధీ ట్రాక్టర్ నడుపుకుంటూ వచ్చారు. కేంద్రం తీసుకొచ్చిన రైతు చట్టాలను బ్యాన్ చేయాలని ఇప్పటికే రైతులు ఢిల్లీలో పెద్ద ఎత్తున పోరాటం చేస్తున్నారు. పార్లమెంట్ సమావేశాల సమయంలో రైతులు ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ధర్నాలు నిర్వహించారు. పార్లమెంట్ ముట్టడిని మొదట ప్రకటించినప్పటికీ, ఆ తరువాత ఆ కార్యక్రమాన్ని విరమించుకున్నారు. ప్రస్తుతం ఢిల్లీ సరిహద్దుల్లో పెద్ద ఎత్తున నిరసన దీక్షలు చేస్తున్న సంగతి తెలిసిందే. వీరికి మద్దతుగా రాహుల్ సోమవారం స్వయంగా ట్రాక్టర్ నడుపుతూ పార్లమెంట్‌కు చురుకున్నారు. కొత్త సాగు చట్టాలను ఉపసంహరించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.
రైతుల సందేశాలను పార్లమెంట్‌కు మోసుకువచ్చినట్లు రాహుల్ తెలిపారు. రైతు గొంతును ప్రభుత్వం నొక్కిపెడుతోందని ఆరోపించారు. పార్లమెంట్లో రైతు చట్టాలపై చర్చ జరగకుండా అడ్డుకుంటోందన్నారు. ఆ నల్ల చట్టాలను ఉపసంహరించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కొత్త సాగు చట్టాలు కేవలం ముగ్గురు వ్యాపారవేత్తలకు మాత్రమే ప్రయోజనకరంగా దేశమంతా తెలుసని ఆయన ఆరోపించారు. రైతులకు ఏ మాత్రం ఉపయోగం లేని ఈ చట్టాలను వెంటనే రద్దు చేయాలని రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు.