వ్యవసాయ బిల్లులకు వైఎస్సార్సీపీ మద్దతు
న్యూఢిల్లీ: రాజ్యసభలో ప్రవేశపెట్టిన వ్యవసాయ బిల్లులకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇచ్చింది. ఇప్పుడు దేశ రాజకీయాల్లో కేంద్రం ప్రవేశపెట్టే వ్యవసాయ బిల్లు అందరు చర్చించుకుంటున్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వ్యవసాయ సంబంధ బిల్లును తిరేకిస్తూ బీజేపీ మిత్రపక్షమైన శిరోమణీ అకాలీదళ్ సభ్యురాలు హర్సిమ్రత్ కౌర్ తన కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. కాగా ఆదివారం సభలో జరిగిన వ్యవసాయ బిల్లులపై చర్చలో వైఎస్సార్సీపీ ఎంపి విజయసాయిరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా విజయసాయి రెడ్డి మాట్లాడుతూ.. ఈ బిల్లులతో రైతులకు స్వేచ్ఛ లభించి, దళారీ వ్యవస్థకు ముగింపు లభిస్తుందని పేర్కొన్నారు. పంటలకు ముందుగానే ధర నిర్ణయం వల్ల రైతులకు ప్రయోజనం జరుగుతుందన్నారు. దళారీల ఆగడాల నుంచి రైతులకు విముక్తి కలుగుతుందని పేర్కొన్నారు. ‘‘మార్కెట్ కమిటీల నియంతృత్వానికి తెరపడుతుంది. బిల్లులో పొగాకును ఎందుకు చేర్చడం లేదు. రైతు ప్రయోజనాలకు వైఎస్సార్ కాంగ్రెస్ అండగా ఉంటుంది. రైతు భరోసా పేరుతో 49 లక్షల మంది రైతులకు ఏటా 13,500 ఇస్తోంది. రైతుల కోసం ధరల స్థిరీకరణ నిధిని సీఎం జగన్ ఏర్పాటు చేశారు.’’ ఆయన వివరించారు. కాగా ఈ సందర్భంగా సభలో కాంగ్రెస్ పార్టీ పై ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ మేనిఫెస్టోలో మార్కెట్ కమిటీలు రద్దు చేసి, పంటల రవాణాపై ఆంక్షలను తొలగిస్తామని చెప్పిందని.. ఆ అంశాలనే ఎన్డీయే బిల్లుగా తెచ్చిందన్నారు. ఆత్మవంచన మానుకోవాలని కాంగ్రెస్కు విజయసాయిరెడ్డి హితవు పలికారు.