జలమండలికి శివారు ప్రాంతాల సెవరేజీ నిర్వహణ
అక్టోబరు 1 నుంచి సెవరేజీ నిర్వహణ చేపట్టనున్న జలమండలి
హైదరాబాద్ (CLiC2NEWS): మున్సిపల్ శాఖ ఆదేశాలతో అక్టోబరు 1 నుంచి జీహెచ్ఎంసీ పరిధిలోని శివారు మున్సిపాలిటీల్లో సెవరేజీ నిర్వహణ జలమండలి చేపట్టనుంది. ఈ నేపథ్యంలో మంగళవారం ఖైరతాబాద్‌లోని జలమండలి ప్రధాన కార్యాలయంలో జలమండలి ఎండీ దానకిశోర్, జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేశ్ కుమార్ ఆధ్వర్యంలో కీలక సమావేశం జరిగింది. ఈ సమావేశంలో జలమండలి, జీహెచ్ఎంసీ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
జీహెచ్ఎంసీ నుంచి సిబ్బంది, వాహనాలు, ఎయిర్‌టెక్ మిషన్లు, ఇతర సామాగ్రి, పరికరాలను జలమండలికి అప్పగించడం, రెండు శాఖల మధ్య ఉండాల్సిన సమన్వయం, ఫిర్యాదులను పరిష్కరించే విధానం వంటి ముఖ్యమైన అంశాలపై ఈ సమావేశంలో చర్చ జరిగింది. సిబ్బంది కొరత, మిషనరీ, వాహనాల కొరత ఉండకుండా చర్యలు తీసుకోవాలని జలమండలి ఎండీ దానకిశోర్ ఉన్నతాధికారులను ఆదేశించారు. ఇంకా సమగ్రమైన వివరాల కొరకు జలమండలి ఆపరేషన్స్ డైరెక్టర్ -2, సీజీఎంలు, జీఎంలు, జీహెచ్ఎంసీ జోనల్ కమిషనర్లు, ఎస్ఈలతో కలిసి చర్చించాలని ఎండీ సూచించారు.
ముఖ్యంగా సెవరేజి సమస్యల పరిష్కారంలో జీహెచ్ఎంసీ జోనల్ కమిషనర్లు, జలమండలి సీజీఎంలు, జీఎంలు సమన్వయంతో వ్యవహరించాలని ఎండీ దానకిశోర్ సూచించారు. సెవరేజీ సమస్యలపై ఫిర్యాదుల కోసం వార్డు కార్యాలయాల్లో కంప్లైంట్ రిజిస్టర్‌ను ఏర్పాటుచేయాలని, ఫిర్యాదులను వెంటనే పరిష్కరించేందుకు ప్రాధాన్యత ఇవ్వాలని ఆయన అధికారులకు సూచించారు. ప్రజలు తమ సమస్యలపై ఫిర్యాదు చేయడానికి గానూ జలమండలి కస్టమర్ కేర్ నెంబరు(155313)తో పాటు ప్రత్యేకంగా మరో ఫోన్ నెంబరును కూడా అందుబాటులోకి తీసుకురానున్నట్లు ఆయన తెలిపారు.
శివారు మున్సిపాలిటీల్లో సెవరేజీ వ్యవస్థ వివరాలు..
శివారు మున్సిపాలిటీల్లోని 66 జీహెచ్ఎంసీ వార్డుల్లో దాదాపుగా 3,600 కి.మీల సెవరెజీ పైపులైను వ్యవస్థ, 3.26 లక్షలకు పైగా మ్యాన్ హోళ్ల నిర్వహణకు దాదాపుగా 650 మంది కార్మికులు అవసరమవుతారని అంచనా వేస్తున్నారు. ఈ నిర్వహణ ఖర్చులకు గాను నెలకు రూ. 12 కోట్ల చొప్పున జీహెచ్ఎంసీ జలమండలికి చెల్లించనుంది. దీంతో పాటు జీహెచ్ఎంసీ వద్ద ఉన్న 24 ఎయిర్ టెక్ యంత్రాలు, 66 మినీ ఎయిర్ టెక్ యంత్రాలు జలమండలికి అప్పగించనుంది. ఇప్పటికే శివారు మున్సిపాలిటీల్లో జలమండలి మొత్తం 8 డివిజన్లలో 73 సెక్షన్లతో విస్తరించి మంచినీటి సరఫరా చేస్తోంది..
ఈ సమావేశంలో జలమండలి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డా. ఎం. సత్యనారాయణ, ఆపరేషన్స్ డైరెక్టర్-2 స్వామి, సీజీఎంలు, జీఎంలు, జీహెచ్ఎంసీ జోనల్ కమిషనర్లు, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.