చెన్నైలో భారీ వర్షాలు.. 3 రోజుల పాటు ఎవరూ రావొద్దని సిఎం స్టాలిన్ సూచన
చెన్నై (CLiC2NEWS): తమిళనాడు రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలపై అక్కడి రాష్ట్ర సర్కార్ అప్రమత్తం అయింది. భారీ.. అతి భారీ వర్షాలతో జనజీవనం అస్తవ్యస్తం అవుతుండడంతో ముఖ్యమంత్రి స్టాలిన్ పరిస్థితిని సమీక్షించారు. ఉన్నతాధికారులతో రివ్యూ చేసిన సీఎం.. సహాయక చర్యలు ముమ్మరం చేయాలని జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. అలాగే మూడు రోజుల పాటు చెన్నైకి ఎవరూ రావొద్దని ముక్యమంత్రి సూచించారు. చెన్నై నుంచి ఎవరూ బయటకు వెళ్లొద్దని కోరారు. లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజలు వెంటనే సురక్షిత ప్రాంతాలకు వెళ్లి ప్రాణాలను కాపాడుకోవాలని కోరారు.
వర్షంలో తడుస్తూ.. నీళ్ళలో నడుస్తూ స్టాలిన్ పర్యటన
వరద ప్రాంతాల్లో సీఎం స్టాలిన్ పర్యటించారు. వరదల వల్ల నష్టపోయిన వారిని ప్రభుత్వం ఆదుకుంటుందన్నారు. చెన్నై సిటీలోని పలు ప్రాంతాలతో పాటు సబర్బన్ ఏరియాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. దీంతో ఎలక్ట్రిసిటీ లోకల్ ట్రైన్స్ రద్దు చేసింది రైల్వే శాఖ. చెన్నై సిటీకి తాగునీటిని అందిస్తున్న చెంబరబాక్కం, పుజల్ రిజర్వాయర్ గేట్లు తెరిచారు. వరద ప్రవాహం పెరగడంతో పుజల్ డ్యాం నుంచి నీటిని విడుదల చేశారు అధికారులు. దీంతో నీరు పరవళ్ళు తొక్కుతోంది.
చెన్నై, కాంచీపురం, చెంగల్పట్టు, తిరువళ్లూరు జిల్లాల్లో విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించారు. ఇక సెలవుల్లో ఉన్న అధికారులు సెలవులు రద్దు చేసుకొని వెంటనే సహాయక చర్యల్లో పాల్గొనాలని ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు.