ద‌స‌రాలోపు ఎస్టీపీల నిర్మాణాన్ని పూర్తి చేయాలి

ఎస్టీపీలు నిర్మించ‌నున్న ప్రాంతాల్లో స్పెష‌ల్ సీఎస్‌ అర్వింద్ కుమార్ ప‌ర్య‌ట‌న‌

హైదరాబాద్ (CLiC2NEWS): హైదరాబాద్ ‌తో పాటు శివారు ప్రాంతాల్లో మురుగునీటి శుద్ధి ప్రక్రియకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటోందని, దీనికి గాను ప్రభుత్వం పకడ్భందీగా ప్రణాళికతో ముందుకు సాగుతోందని ప్రభుత్వ ప్ర‌త్యేక ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి అర్వింద్ కుమార్ అన్నారు. మున్సిప‌ల్ శాఖ మంత్రి కల్వ‌కుంట్ల తార‌కరామారావు ఆదేశాలతో ప్యాకేజీ 3లో చేపట్టబోయే ఫాక్స్ సాగర్ ఎస్టీపీ(14 ఎమ్మెల్డీలు), వెన్నెలగ‌డ్డ ఎస్టీపీ(10 ఎమ్మెల్డీలు) ప్రాంతాలను జలమండలి ఎండీ దానకిశోర్, మేడ్చ‌ల్ మ‌ల్కాజ్‌గిరి జిల్లా కలెక్టర్ హరీశ్, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు, కుత్భుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద్‌లతో కలిసి పరిశీలించారు.

ఈ సందర్భంగా అధికారులు, ప్రజాప్రతినిధుల‌తో ఎస్టీపీలు నిర్మించేందుకు చేయాల్సిన ఏర్పాట్ల గురించి చర్చించారు. మురుగు నీటి శుద్ది ప్రక్రియ జరిగినట్లయితే చెరువు ఆవరణలో మంచి ఆహ్లాదకరమైన వాతావరణం ఏర్పడుతుందని పేర్కొన్నారు. ఈ మేరకు ఇప్పటి వరకు జరిగిన పనులు, చేపట్టబోయే పనులపై సంబంధిత అధికారులను వివరాలను అడిగి తెలుసుకొన్నారు. ఈ సందర్భంగా పనులపై రూపొందించిన ప్రణాళికతో పాటు చేపట్టాల్సిన పనులకు సంబంధించిన ప్లాన్ మ్యాప్ లను పరిశీలించారు. ద‌స‌రాలోపు ఎస్టీపీల నిర్మాణం పూర్త‌వ్వాల‌ని ఆయ‌న అధికారుల‌ను ఆదేశించారు.

మొద‌టిద‌శ‌లో 17 ఎస్టీపీల నిర్మాణం

పెరుగుతున్న న‌గ‌ర ప్ర‌జ‌ల అవ‌స‌రాల‌కు అనుగుణంగా నగరంలో కొత్తగా రూ. 1280.87 కోట్లతో కూకట్‌పల్లి, కుత్బుల్లాపూర్, శేరిలింగంపల్లి సర్కిల్ ప్రాంతాల్లో 376.5 ఎమ్మెల్డీల మురుగునీటిని శుద్ధి చేసే లక్ష్యంగా మొద‌టిద‌శ‌గా జలమండలి 17 కొత్త ఎస్టీపీల నిర్మాణం చేపట్టింది.

మొత్తం 31 కొత్త ఎస్టీపీల నిర్మాణం

న‌గ‌రంతో పాటు శివారు మున్సిపాలిటీ ప్రాంతాల్లో.. సీవ‌రేజి మాస్ట‌ర్ ప్లాన్ లో భాగంగా మురుగు నీటి శుద్ధి కేంద్రాల‌ను(ఎస్టీపీ) నిర్మించాల‌ని జ‌ల‌మండ‌లి త‌ల‌పెట్టింది. గ్రేట‌ర్ హైద‌రాబాద్ ప‌రిధిలో మొత్తం మూడు ప్యాకేజీల కింద‌ నిత్యం 1257.50 ఎమ్మెల్డీల (మిలియ‌న్ లీట‌ర్ ప‌ర్ డే) మురుగు నీరు శుద్ధి చేయాల‌నే ల‌క్ష్యంతో మొత్తం 31 మురుగునీటి శుద్ధి కేంద్రాల‌ను (ఎస్టీపీ) జ‌ల‌మండ‌లి నిర్మిస్తుంది.

3 ప్యాకేజీల్లో నిర్మాణం

ఇందులో భాగంగా ప్యాకేజీ-I లో అల్వాల్, మ‌ల్కాజ్ గిరి, కాప్రా, ఉప్ప‌ల్ స‌ర్కిల్ ప్రాంతాల్లో.. రూ.1230.21 కోట్ల‌తో 8 ఎస్టీపీల‌ను ఏర్పాటు చేయ‌నున్నారు. వీటి ద్వారా 402.50 ఎమ్మెల్డీల మురుగు నీటిని శుద్ధి చేస్తారు.

ప్యాకేజీ-II లో రాజేంద్ర‌న‌గ‌ర్, ఎల్బీ న‌గ‌ర్ స‌ర్కిల్ ప్రాతాల్లో రూ. 1355.33 కోట్ల‌తో 6 ఎస్టీపీల‌ను ఏర్పాటు చేయ‌నున్నారు. ఇక్క‌డ 480.50 ఎమ్మెల్డీల మురుగు నీటిని శుద్ధి చేస్తారు.

ప్యాకేజీ-III లో కూక‌ట్ ప‌ల్లి, కుత్బుల్లాపూర్, శేరిలింగంప‌ల్లి స‌ర్కిల్ ప్రాంతాల్లో రూ.1280.87 కోట్ల వ్య‌యంతో 17 ఎస్టీపీల‌ను ఏర్పాటు చేసి, ఇక్క‌డ 376.5 ఎమ్మెల్డీల మురుగు నీటిని శుద్ధి చేయ‌నున్నారు. ప్యాకేజీ-III లో భాగంగానే ఫ‌తేన‌గ‌ర్ లో నిర్మిస్తున్న ఎస్టీపీకి ఆగస్టు 6న‌ పుర‌పాల‌క, ప‌ట్ట‌ణాభివృద్ధి శాఖ‌ మంత్రి క‌ల్వ‌కుంట్ల తార‌క రామారావు శంఖుస్థాప‌న చేసిన సంగ‌తి తెలిసిందే.

ఈ కార్యక్రమంలో మేడ్చ‌ల్ మ‌ల్కాజ్‌గిరి జిల్లా అదనపు కలెక్టర్ శ్యాంసన్, జలమండలి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డా. ఎం. సత్యనారాయణ, ప్రాజక్టు డైరెక్టర్ శ్రీధర్ బాబు, జీహెచ్ఎంసీ జోనల్ కమిషనర్ మమత, ఇంజనీరింగ్, పంచాయతీరాజ్, మున్సిపల్ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

 

Leave A Reply

Your email address will not be published.