కొల్లూరు డ‌బుల్ బెడ్రూం ఇండ్ల‌కు జ‌ల‌మండ‌లి మంచినీటి స‌ర‌ఫ‌రా

పైప్‌లైన్ ప‌నుల‌ను ప‌రిశీలించిన జ‌ల‌మండ‌లి ఎండీ దాన‌కిశోర్‌

హైద‌రాబాద్‌ (CLiC2NEWS): తెలంగాణ రాష్ట్ర ప్ర‌భుత్వం ఇల్లు లేని నిరుపేద‌ల కోసం న‌గ‌ర శివారులోని కొల్లూరులో ప్ర‌తిష్ఠాత్మ‌కంగా నిర్మిస్తున్న డ‌బుల్ బెడ్రూం ఇండ్ల‌ మోడ‌ల్ టౌన్‌షిప్‌కు మౌళిక స‌దుపాయాల క‌ల్ప‌న‌లో భాగంగా జ‌ల‌మండ‌లి మంచినీటి స‌ర‌ఫ‌రా చేయ‌నుంది. ఇందుకోసం చేప‌ట్టిన‌ పైప్‌లైన్ విస్త‌ర‌ణ‌ ప‌నుల‌ను జ‌ల‌మండ‌లి ఎండీ దాన‌కిశోర్ శుక్ర‌వారం ప‌రిశీలించారు.

మున్సిప‌ల్ శాఖ మంత్రి క‌ల్వ‌కుంట్ల తార‌క‌రామారావు ఆదేశాల‌ మేర‌కు కొల్లూరులో నిర్మిస్తున్న డ‌బుల్ బెడ్రూం మోడ‌ల్ టౌన్‌షిప్ ఫేజ్ – 1లో 2,052 ఇళ్ల‌కు, ఫేజ్ -2లో 15,660 ఇళ్ల‌కు జ‌ల‌మండ‌లి మంచినీటి స‌ర‌ఫ‌రాను చేప‌ట్ట‌నుంది. దీనికోసం ఔట‌ర్ రింగ్ రోడ్డు చుట్టూ ఉన్న జ‌ల‌మండ‌లి రింగ్ మెయిన్ నుంచి నీటిని అందించేందుకు జ‌లమండ‌లి దాదాపు 18 కిలోమీట‌ర్ల పైప్‌లైన్ విస్త‌ర‌ణ ప‌నులు ఇప్ప‌టికే పూర్తి చేసింది. అయితే, కొల్లూరు స‌మీపంలో రైల్వే ట్రాక్ ఉండ‌టంతో ట్రాక్‌కు ఇబ్బంది లేకుండా కింది నుంచి(అండ‌ర్ పాస్‌) పైప్‌లైన్ వేసే ప‌నులు ప్ర‌స్తుతం జ‌రుగుతున్నాయి. ఈ ప‌నుల‌ను ప‌రిశీలించిన‌ ఎండీ దాన‌కిశోర్.. ప‌నుల పురోగ‌తిని అధికారుల‌ను అడిగి తెలుసుకున్నారు. డ‌బుల్ బెడ్రూం ఇళ్ల మోడ‌ల్ టౌన్‌షిప్ ప్రారంభ‌మ‌య్యే నాటికి నీటిని స‌ర‌ఫ‌రా చేసేందుకు గానూ వీలైనంత త్వ‌ర‌గా ఈ ప‌నులు పూర్తి చేసి స‌న్న‌ద్ధంగా ఉండాల‌ని ఆయ‌న అధికారుల‌ను ఆదేశించారు. ఈ కార్య‌క్ర‌మంలో టెక్నిక‌ల్ డైరెక్ట‌ర్ ర‌వికుమార్‌, ప్రాజెక్ట్ ఉన్న‌తాధికారులు పాల్గొన్నారు.

 

Leave A Reply

Your email address will not be published.