న‌గ‌రంలో అధునాత‌న ఎస్‌బిఆర్ టెక్నాల‌జీతో ఎస్టీపీల నిర్మాణం

కొత్త ఎస్టీపీల నిర్మాణాన్ని ప‌రిశీలించిన ఎండీ దాన‌కిశోర్‌

హైద‌రాబాద్‌ (CLiC2NEWS): అధునాత‌న టెక్నాల‌జీతో న‌గ‌రంలో కొత్త‌గా నిర్మిస్తున్న సీవ‌రేజి ట్రీట్‌మెంట్ ప్లాంట్ల‌(ఎస్టీపీ)ను అక్టోబ‌రు నాటికి పూర్తి చేసే ల‌క్ష్యంతో ప‌ని చేయాల‌ని జ‌ల‌మండ‌లి ఎండీ దాన‌కిశోర్ అధికారుల‌ను, నిర్మాణ సంస్థ‌ల‌ను ఆదేశించారు. 86.50 ఎంఎల్‌డీ సామ‌ర్థ్యంతో ఉప్ప‌ల్ న‌ల్ల‌చెరువు, 320.00 ఎంఎల్‌డీ సామ‌ర్థ్యంలో నాగోల్ వ‌ద్ద నిర్మిస్తున్న ఎస్టీపీల ప‌నుల‌ను ప‌రిశీలించారు. నిర్మాణ ప‌నుల పురోగ‌తిని ఆయ‌న అధికారులను అడిగి తెలుసుకున్నారు.

ఎస్టీపీల నిర్మాణంలో వేగం పెంచాల‌ని ఆయన ఆదేశించారు. మూడు షిఫ్టుల్లో ప‌నులు జ‌రిగేలా చూడాలని నిర్మాణ సంస్థ‌ల‌కు సూచించారు. ఎస్‌టీపీల్లో భాగ‌మైన సీసీటీ, ఇన్‌లెట్‌, అవుట్‌లెట్, త‌దిత‌ర నిర్మాణ‌ పనులు ఏక‌కాలంలో చేప‌ట్ట‌డం ద్వారా వేగంగా ఎస్టీపీల‌ను పూర్తి చేయాల‌ని సూచించారు. స‌రిప‌డా కార్మికులు, యంత్రాలు ఉండేలా చూసుకోవాలని, కార్మికుల ర‌క్ష‌ణ‌కు క‌చ్చితమైన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ఆదేశించారు. రాత్రివేళ‌ల్లో ప‌నులు జ‌రిపేందుకు స‌రిప‌డా లైటింగ్ ఏర్పాటుచేయాల‌ని సూచించారు. ఎస్టీపీల నిర్మాణ ప్ర‌దేశాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటుచేసి జ‌ల‌మండ‌లి ప్ర‌ధాన కార్యాల‌యానికి అనుసంధానం చేయాల‌ని ఆదేశించారు.

అధునాత‌న సీక్వెన్సింగ్ బ్యాచ్ రియాక్ట‌ర్ టెక్నాల‌జీతో కొత్త ఎస్టీపీల నిర్మాణం జ‌రుగుతోంద‌ని ఎండీ దాన‌కిశోర్ పేర్కొన్నారు. త‌క్కువ స్థ‌లంలోనే వీటిని నిర్మించే అవ‌కాశం ఉంటుంద‌న్నారు. మెట్రో న‌గ‌రాల్లో స్థ‌లాభావం ఉంటుంది కాబ‌ట్టి ఎస్‌బీఆర్ టెక్నాల‌జీ ఎస్టీపీలు అనువైన‌వ‌ని తెలిపారు. ఒకే ఛాంబ‌ర్‌లో ఐదు స్టేజీల‌ మురుగునీటి శుద్ధి ప్ర‌క్రియ‌ను జ‌రప‌గ‌లిగే ఎస్‌బీఆర్ టెక్నాల‌జీ ఎస్టీపీలు త‌క్కువ విస్తీర్ణంలో ఎక్కువ నీటిని శుద్ధి చేస్తాయ‌ని తెలిపారు. దేశంలో ఉన్న వివిధ బ‌యోలాజిక‌ల్ ట్రీట్‌మెంట్ ప‌ద్ధ‌తుల‌ కంటే ఈ ఎస్‌బీఆర్‌ విధానానికి త‌క్కువ ఖ‌ర్చు అవుతుంద‌ని తెలిపారు. మిగ‌తా మురుగుశుద్ధి ప‌ద్ధ‌తుల కంటే ఎస్‌బీఆర్ ప‌ద్ధ‌తిలో మెరుగ్గా మురుగునీటి శుద్ధి జ‌రుగుతుంద‌ని తెలిపారు. ఇది తేలికైన విధాన‌మ‌ని, దీనికి విద్యుత్ వినియోగం కూడా త‌క్కువ‌గా ఉంటుంద‌ని పేర్కొన్నారు. కార్య‌క్ర‌మంలో ప్రాజెక్ట్ డైరెక్ట‌ర్ శ్రీధ‌ర్ బాబు, ఎప్టీపీ సీజీఎంలు, జీఎంలు, త‌దిత‌రులు పాల్గొన్నారు.

 

Leave A Reply

Your email address will not be published.