జనగామ ఎంసిహెచ్ వైద్యురాలు డా.రుద్రోజు శిరీషకు ‘విశిష్ట మహిళ’ పురస్కారం
జనగామ (CLiC2NEWS): జనగామ జిల్లా కేంద్రం మాతా శిశు వైద్యశాల గైనకాలజిస్ట్ డా. రుద్రోజు శిరీష విశిష్ట మహిళా పురస్కారాన్ని అందుకున్నారు. హైదరాబాద్లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో “విశ్వకర్మ సాంస్కృతిక చైతన్య వేదిక” ఆధ్వర్యంలో మహిళా దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర స్థాయి విశిష్ట మహిళా పురస్కారాలు అందజేశారు. కోవిడ్ సమయంలో కరోనా సోకిన గర్భిణులకు ధైర్యంగా ప్రసవంచేసి అధికారుల అభినందనలు అందుకుని స్ఫూర్తినిచ్చినందుకు ఈ అవార్డు అందించారు. అదేవిధంగా ఉత్తమ మహిళా కండక్టర్ టిఎస్ఆర్టీసి జనగామ డిపో అయిలా వినయ కూడా అవార్డు అందుకున్నారు. .
ఎఐసిసి అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్,హైకోర్టు రిటైర్డ్ జడ్జి జస్టిస్ చంద్రకుమార్,సినీగేయ రచయిత అభినయ శ్రీనివాస్ ల సమక్షంలో ఈ పురస్కారం అందించామని విశ్వకర్మ సాంస్కృతిక చైతన్య వేదిక అధ్యక్షుడు అయిలా సోమనర్సింహా చారి తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలంగాణతల్లి విగ్రహ రూపశిల్పి బి.వి.ఆచార్య, రచయిత్రి వలభోజు జ్యోతి, సంస్థ ప్రతినిధులు కొండోజు రాజేష్ చారి, దాసోజు వికాస్, ముస్తాల నర్సింహాచారి,చిలుమోజు సాయికిరణ్ తదితరులు పాల్గొన్నారు.