అన్నాడీఎంకే సీఎం అభ్య‌ర్థిగా పళనిస్వామి

చెన్నై: తమిళనాడులోని అధికారిపార్టీ అన్నాడీఎంకేలో సంక్షోభం ముగిసింది. అన్నాడీఎంకే సీఎం అభ్యర్థిగా ఎడప్పాడి పళనిస్వామి పేరు ఖరారైంది. వచ్చే ఎన్నికల్లో ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఆయన పేరునే ఎంపిక చేశారు. ఈమేరకు చెన్నైలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో కొద్దిసేపటి క్రితం జరిగిన భేటీలో నిర్ణయం తీసుకున్నారు. సీఎం అభ్యర్థిగా పళనిస్వామి పేరును పన్నీర్‌ సెల్వం ప్రతిపాదించారు. పార్టీ వ్యవహారాల పర్యవేక్షణ బాధ్యతను పన్నీర్‌ సెల్వంకు అప్పగించారు.

ఇందుకు సంబంధించిన ఒప్పంద పత్రాలపై పళనిస్వామి, పన్నీర్ సెల్వం సంతకాలు చేశారు. ఇక.. 11 మంది సభ్యులతో స్టీరింగ్‌ కమిటీని ఏర్పాటు చేశారు. ఇందులో పళనిస్వామి మద్దతుదారులు ఆరుగురు, పన్నీర్‌ సెల్వం మద్దతుదారులు ఐదుగురు ఉన్నారు. సీఎం అభ్యర్థి ఎవరనే అంశంపై పార్టీలో ఇప్పటి వరకు భారీ ఎత్తున వివాదం నడిచింది. సీఎం అభ్యర్థిగా తననే ప్రకటించాలని బెట్టుచేసిన పన్నీర్‌సెల్వం పట్టుసడలించారు. దీంతో వచ్చే యేడాది జరుగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో సీఎం అభ్యర్థి చాన్స్‌ ప్రస్తుత ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామికే దక్కింది. ఇవాళ ఉదయం జరిగిన సమావేశంలో ఇద్దరూ కలిసి సీఎం అభ్యర్థి ఎంపికపై అధికారికంగా ప్రకటించారు.

Leave A Reply

Your email address will not be published.