జనవరి 27న శ్రీవాణి ట్రస్టు ఫిబ్రవరి కోటా టికెట్లు విడుదల: టిటిడి
తిరుమల (CLiC2NEWS): ఈనెల 27వ తేదీ ఉదయం 9 గంటలకు శ్రీవాణి ట్రస్టు దాతలకు ఇచ్చే బ్రేక్ దర్శనం టికెట్లను విడుదల చేయనున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం ప్రకటించింది. రోజుకు వెయ్యి చొప్పున.. ఆన్లైన్లో 750 టికెట్లు, 250 టికెట్లు కరెంట్ బుకింగ్ ద్వారా జారీ చేయనున్నారు. గతంలో శ్రీవాణి ట్రస్టు టికెట్లు రోజుకు రెండు వేలు జారీ చేసేవారు. అయితే.. సామాన్య భక్తులకు మరింత ఎక్కువమందికి శ్రీవారి దర్శనం కల్పించేందుకు వీలుగా ఆసంఖ్యను వెయ్యికి తగ్గించింది. 250 కరెంట్ బుకింగ్ టికెట్లను రేణిగుంట విమానాశ్రయంలో జారీ చేయనున్నట్లు తెలిపారు.
జనవరి 28వ తేదీన రథసప్తమి వేడుకలు ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సందర్బంగా 28వ తేదీన తిరుపతి కౌంటర్లో సర్వదర్శనం టైమ్‌స్లాట్ టోకెన్ల జారీ రద్దు చేస్తున్నారు. భక్తులు ఆరోజు వైకుంఠం క్యూ కాంప్లెంక్స్-2 ద్వారా స్వామివారిని దర్శించుకోవాలని సూచించారు. విఐపి బ్రేక్, ఆర్జిత సేవలు, వృద్ధులు, దివ్యాంగుల ప్రత్యేక దర్శానాలను కూడా రద్దు చేస్తున్నారు. ఈనెల 27, 28 తేదీల్లో వసతి గదుల ముందస్తు బుకింగ్ కూడా రద్దు చేసినట్లు తెలిపారు.