పేపర్ లీక్ వ్యవహారం వెనుక ఎవరున్న వదిలేది లేదు: మంత్రి కెటిఆర్
హైదరాబాద్ (CLiC2NEWS): టిఎస్‌పిఎస్‌సి పరీక్ష పేపర్ లీక్ వ్యవహారం వెనుక ఎవరున్నా వదిలేది లేదని రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి కెటిఆర్ స్పష్టం చేశారు. ప్రశ్నాపత్రం లేకేజీ కారణంగా రద్దు చేసిన పరీక్షలు తిరిగి నిర్వహిస్తారని.. ఎవరూ కూడా ఫీజులు మళ్లీ చెల్లించనవసరం లేదని మంత్రి తెలిపారు. ముఖ్యమంత్రి కెసిఆర్‌తో మంత్రులు, ఉన్నతాధికారుల సమావేశం ముగిసిన అనంతరం మంత్రి కెటిఆర్ మీడియాతో మాట్లాడారు. ప్రశ్నాపత్రం లీకేజి కేసులో ఎవరున్నా కఠిన చర్యలు తప్పవని పేర్కొన్నారు. ప్రవీణ్, రాజశేఖర్ రెడ్డి.. చేసిన తప్పుకు మొత్తం వ్యవస్థకే చెడ్డపేరు వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. భవిష్యత్తులో ఇలాంటివి పునరావృతం కాకుండా చూడాలని.. ఆ బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. అంతే కాకుండా ఈ ఘటన వలన నాలుగు పరీక్షలు రద్దయినాయని.. ఆ పరీక్షలు త్వరలో నిర్వహిస్తారని తెలిపారు. అభ్యర్థులు పరీక్ష ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. ఈ నాలుగు పరీక్షలకు సంబంధించిన కోచింగ్ మెటీరియల్ ఆన్‌లైన్‌లో పెడతామని.. ఉచితంగా మెటీరియల్ అందించే బాధ్యత మాదని అన్నారు. దీంతోపాటు ఉచిత భోజన వసతి కూడా కల్పిస్తామని కెటిఆర్ తెలిపారు.