రాత్రి 7.45 నుంచి తెల్ల‌వారుజామున‌ 3 వ‌ర‌కు చితక్కొట్టారు..

సాతాన్‌కుళం కస్టడీ మరణాల కేసులో సిబిఐ వెల్లడి

చెన్నై : తమిళనాట సంచలనం సృష్టించిన తండ్రీకొడుకులు జయరాజ్‌, బెనిక్స్‌ కస్టడీ డెత్‌ కేసులో కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ) మద్రాస్‌ హైకోర్టుకు నివేదిక అందజేసింది. ‘‘రిజల్ట్స్‌ ఆఫ్‌ లాబొరేటరి అనాలిసిస్‌’’ పేరిట రూపొందించిన ఫోరెన్సిక్‌ రిపోర్టును మధురై ధర్మాసనానికి సమర్పించింది. జూన్‌ 19న లాక్‌డౌన్‌ నిబంధనలను ఉల్లంఘిస్తూ మొబైల్‌ షాపు తెరిచారన్న ఆరోపణలపై తండ్రి, కుమారులు జయరాజ్‌, బెన్నిక్స్‌ అదుపులోకి తీసుకున్న సాతాన్‌కుళం పోలీసులు…స్టేషన్‌కు తీసుకెళ్లి రాత్రంతా అమానుషంగా కొట్టడంతోనే వారు చనిపోయారని సిబిఐ తెలిపింది. తీవ్ర గాయాలతో వీరిద్దరూ అదే నెల 22న గంటల వ్యవధిలో చనిపోయిన సంగతి తెలిసిందే. సుమారుగా వారిని ఆరుగంటలకు పైగా దారుణంగా దాడి చేసినట్లు ఫోరెన్సిక్‌ ఆధారాలు వెల్లడిస్తున్నాయని చెప్పింది.

అదుపులోకి తీసుకున్న రోజు రాత్రి 7.45 నుండి మరుసటి రోజు తెల్లవారు జామున 3 గంటల మధ్య పలుమార్లు చిత్ర వధకు గురిచేస్తూనే ఉన్నారని సిబిఐ చార్జీషీట్‌లో పేర్కొంది. దారుణంగా కొట్టడంతో తీవ్ర గాయాలై బెన్నిక్స్‌ మరణించాడని పోస్ట్‌ మార్టం నివేదికలో పేర్కొంది. పోలీస్‌ స్టేషన్‌ నిండా రక్తపు మరకలు కాగా..వాటిని కూడా బెన్నిక్స్‌ చొక్కాతో శుభ్రపరిచారని వెల్లడైంది. తమ నేరాన్ని కప్పిపుచ్చుకునేందుకు బెన్నిక్స్‌, జయరాజ్‌లపై తప్పుడు కేసులు బనాయించారని సిబిఐ తెలిపింది. ఇద్దరూ లాక్‌డౌన్‌ నిబంధనలను ఉల్లంఘించలేదని విచారణలో వెల్లడైనట్లు చెప్పింది. సాక్ష్యాలను సైతం ధ్వంసం చేశారని తెలిపింది. కాగా రౌండ్ల‌వారీగా పోలీసులు ఆ ఇద్ద‌ర్నీ కొట్టిన‌ట్లు సీబీఐ త‌న నివేదిక‌లో చెప్పింది. ఇన్‌స్పెక్ట‌ర్ ఎస్ శ్రీధ‌ర్ ప్రేరేపించ‌డంతో తండ్రీకొడుకుల‌పై పోలీసులు లాఠీలు విరిగేలా చెల‌రేగిన‌ట్లు తెలుస్తోంది.

Leave A Reply

Your email address will not be published.