Tirumala: నూతన శ్రీవాణి దర్శన టికెట్ల జారీ కేంద్రం ప్రారంభం..
తిరుమల (CLiC2NEWS): అత్యాధునిక మౌలిక సదుపాయాలతో తిరుమలలో నూతన శ్రీవాణి దర్శన టికెట్ల జారీ కేంద్రం ప్రారంభమైంది. అన్నమయ్య భవనం ఎదురుగా టికెట్ల కేంద్రాన్ని టిటిడి ఛైర్మన్ బిఆర్ నాయుడు, ఇఒ జె.శ్యామల రావు ప్రారంభించారు. ఛైర్మన్ మాట్లాడుతూ.. భక్తులు శ్రీవాణి దర్శన టికెట్ల కోసం బారులు తీరుతున్నారని.. వారికి సులభతరంగా టికెట్లు జారీ చేసేందుకు రూ.60లక్షల వ్యయంతో నూతన కౌంటర్లను నిర్మించినట్లు తెలిపారు. బుధవారం నుండి ఈ కౌంటర్ల ద్వారా టికెట్ల పంపిణీ ప్రారంభం కానుంది. భక్తులు ఈ సదుపాయాన్ని వినియోగించుకోవాలన్నారు.
అనంతరం హెచ్‌విసి, ఎఎన్‌సి ప్రాంతాల్లో భక్తుల సౌలభ్యం కోసం నూతనంగా ఆధునీకరించిన ఉప విచారణ కార్యాలయాలను సైతం ఆయన ప్రారంభించారు. మరోవైపు నూతనంగా ఏర్పాటు చేసిన ఆహార నాణ్యత పరీక్ష పరిశోధన శాలను బిఆర్ నాయుడు ప్రారంభించారు. ఈసందర్బంగా ఆయన మాట్లాడుతూ.. గతంలో స్వామివారి ప్రసాదాలు, నెయ్యి లాంటివి నాణ్యత నిమిత్తం పరీక్షించేందుకు ఇతర రాష్ట్రాలకు నమూనాలను పంపాల్సి వచ్చేదని.. ఇపుడు తిరమలలోనే అత్యాధునిక పరికరాలతో పరీక్షలు నిర్వహించేలా ల్యాబ్‌ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
తిరుమలలోని అన్నమయ్య భవనంలో టిటిడి పాలక మండలి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను టిటిడి ఛైర్మన్ మరియు ఇఒ మీడియాకు వెల్లడించారు. ఒంటిమిట్ట రామాలయంలో పూర్తిస్థాయి అన్న ప్రసాద వితరణకు రూ.4.35 కోట్లు కేటాయిస్తున్నట్లు తెలిపారు. ఆగస్టు నుండి భక్తులకు మూడు పూటలా అన్నప్రసాద విస్తరణ జరుగుతుందన్నారు. తిరుమలలో భక్తుల ర్దీ పెరుతున్నందున వైకుంఠం క్యూ కాంప్లెక్స్ -3 నిర్మించేందుకు .. సాధ్యసాధ్యాలను పరిశీలించేందుకు నిపుణుల కమిటి వేయాలని నిర్ణయించారు. తిరుమలలో అన్ని కార్యాలయాలు ఒకే చోట ఉండేలా పరిపాలనా భవనం నిర్మించాలని నిర్ణయించినట్లు వెల్లడించారు.