మహిళల అక్రమ రవాణా గుట్టురట్టు..!
పట్నా (CLiC2NEWS): పశ్చిమ బెంగాల్ నుండి బిహార్‌కు తరలిస్తున్న 56 మంది యువతులను అధికారులు రక్షించారు. రైలులో కొంతమంది యువతులు కలిసికట్టుగా ప్రయాణిస్తున్నారు. వారెవరి వద్దా టికెట్లు కానీ.. ఎలాంటి పత్రాలు కానీ లేవు. పైగా వారి చేతులపై కోచ్, బెర్త్ నంబర్ల స్టాంప్‌లు ఉన్నాయి. దీంతో అనుమానం వచ్చిన ఆర్‌పిఎఫ్ సిబ్బంది ఆరా తీయగా.. మహిళల అక్రమ రవాణా గుట్టు బయటపడింది. వీరంతా న్యూ జల్పాయ్‌గురి-పట్నా క్యాపిటల్ ఎక్స్‌ప్రెస్‌లో బెంగాల్ నుండి బిహార్‌కు వెళుతున్నారు.
మహిళలంతా 18 నుండి 31 ఏళ్ల లోపు వారే. వారి ముఖాల్లో ఆందోళన గమనించిన రైల్వే సిబ్బంది వారి టికెట్లను చూపించమని అడిగారు. వారి వద్ద ఎటువంటి పత్రాలు కానీ టికెట్టు గాని లేకపోవడంతో వారిని ప్రశ్నించారు. వారంతా బెంగళూరుకు ఉద్యోగం కోసం వెళుతున్నట్లు చెప్పారు. బెంగళూరు వెళ్లేటపుడు బిహార్ ట్రైన్ లో ఉన్నారేంటని సిబ్బంది ప్రశ్నించగా.. పొంతన లేని సమాధానాలు చెప్పడంతో వారిని అరెస్టు చేశారు. మొత్తం 56 మంది మహిళలతో పాటు ఓ మహిళ , పురుషుడు ఉన్నారు. మహిళల అక్రమ రవాణాలో భాగంగా వీరిని బిహార్ తరలిస్తున్నట్లు ప్రాథమిక విచారణలో తేలింది. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.