Kamareddy: బీబీపేట్ పోలీస్ స్టేషన్‌లో ఎస్పీ ఆకస్మిక తనిఖీ

కామారెడ్డి (CLiC2NEWS): కామారెడ్డి జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర సోమవారం బీబీపేట్ పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సంద‌ర్భంగా స్టేష‌న్ పరిసరాలు, సిబ్బంది బ్యారక్‌లను పరిశీలించిన ఎస్పీ శుభ్రత, క్రమశిక్షణ పాటించడం ప్రతి పోలీసు సిబ్బంది బాధ్యత అని సూచించారు.

ముందుగా రోల్‌కాల్ పరిశీలించిన ఎస్పీ, హాజరు, గైర్హాజరు సిబ్బంది వివరాలు తెలుసుకొని రోల్‌కాల్ ప్రాముఖ్యతను వివరించారు. ఇది సిబ్బందిలో నిబద్ధత, బాధ్యతా భావాలను పెంపొందిస్తుందని పేర్కొన్నారు. ప్రతి పోలీసు అధికారి సమయపాలన, క్రమశిక్షణ పాటిస్తూ వృత్తి పరమైన గౌరవాన్ని కాపాడాలని సూచించారు. శుభ్రమైన యూనిఫారం ధరించడం, వ్యక్తిగత సంస్కారం కాపాడుకోవడం పోలీసు గౌరవానికి ప్రతీక అని అన్నారు.

తనిఖీ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ, “దర్యాప్తులో కానిస్టేబుళ్ల పాత్ర అత్యంత కీలకమని, ప్రతి కేసును నిజాయితీతో విచారించి ప్రజలకు న్యాయం చేయడం మన బాధ్యత” అని పేర్కొన్నారు. ప్రజలతో మర్యాదపూర్వకంగా వ్యవహరించడం, ఫిర్యాదులపై వేగంగా స్పందించడం ద్వారా ప్రజల్లో విశ్వాసం పెంపొందుతుందని తెలిపారు.

ప్రజల రక్షణే పోలీస్ శాఖ ప్రధాన ధ్యేయమని, డయల్‌ 100 ద్వారా వచ్చే ప్రతి ఫిర్యాదుపై వేగంగా స్పందించాలని సూచించారు. విపిఒలు తరచూ గ్రామాలను సందర్శిస్తూ సమాచార వ్యవస్థను బలోపేతం చేయాలని ఆదేశించారు.

ఈ తనిఖీలో ఏఎస్పీ బి. చైతన్య రెడ్డి, ఐపీఎస్, ఎస్‌ఐ ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.

Also Read: `ఆదాయం త‌గ్గిపోయింది.` మంత్రి ప‌ద‌వికి రాజీమా చేస్తా..!

Leave A Reply

Your email address will not be published.