ఆర్టిసి ఉద్యోగులకు సిఎం కెసిఆర్ శుభవార్త!
హైదరాబాద్ : తెలంగాణ ఆర్టిసి సిబ్బందికి సిఎం కెసిఆర్ శుభవార్త అందించారు. కరోనా నేపథ్యంలో ఆర్టీసీ ఉద్యోగుల వేతనాల్లో విధించిన కోత మొత్తాన్ని తిరిగి చెల్లించాలని సీఎం కేసీఆర్ ఆర్ధికశాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావును ఆదేశించారు. ఆర్టిసిపై రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజరు, ఉన్నతాధికారులతో ప్రగతి భవన్లో సిఎం సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో ఆర్టిసి ఉద్యోగ భద్రతపై చర్చించారు. ఈ సందర్భంగా కెసిఆర్ మాట్లాడుతూ.. ఆర్టిసి ఉద్యోగుల జీతాల్లో రెండు నెలల పాటు కోత విధించిన 50 శాతం మొత్తాన్ని చెల్లించాలని, దీనికి అవసరమైన రూ.130 కోట్ల నిధులు విడుదల చేయాలని ఆర్థిక శాఖను ఆదేశించామన్నారు. హైదరాబాద్ నగరంలో 50 శాతం బస్సులను పునరుద్ధరించాలని ఆర్టిసి ఎండి సునీల్ శర్మకు కెసిఆర్ సూచించారు. కరోనా కారణంగా ఇప్పటివరకు కేవలం 25 శాతం మాత్రమే బస్సులు నడుస్తున్న సంగతి తెలిసిందే.
ఆర్టీసీలో ప్రవేశపెట్టిన కార్గో సేవలను ప్రజలు గొప్పగా ఆదరిస్తున్నారని సీఎం అన్నారు. రాను రాను భవిష్యత్తులో రైల్వేలో మాదిరి, ఆర్టీసీ కూడా కార్గో సేవలతో లాభాలను గడిస్తుందని సీఎం ఆశాభావం వ్యక్తం చేశారు. కార్గో సేవలను ప్రారంభించిన అనతికాలంలోనే మిలియన్ పార్సెల్ ట్రాన్స్ పోర్టు చేసిన రికార్డును ఆర్టీసి సొంతం చేసుకోవడం పట్ల సీఎం ఆనందం వ్యక్తం చేశారు. జన సంచారం క్రమ క్రమంగా పుంజుకుంటున్నది. ఈ నేపథ్యంలో ప్రజలు ఆర్టీసిని తిరిగి ఆదరించాలంటే ఎటువంటి విధానాలను అవలంభించాలో లోతుగా చర్చించాల్సిందిగా సీఎం అధికారులను ఆదేశించారు. హైద్రాబాద్ సిటీలో బస్సుల సంఖ్యను పెంచడం ద్వారా హైద్రాబాద్‌కు జిల్లాలనుంచి వచ్చి పోయే ప్రయాణీకులకు రవాణా భరోసా దొరుకుదుందని, అందుకోసం హైదరాబాద్‌లో బస్సు సర్వీసులను యాభై శాతానికి పెంచాలని సీఎం తెలిపారు.