మహిళల రక్షణ కోసం ‘అభయం’

అమ‌రావ‌తి: రాష్ట్రంలో మహిళలు, చిన్నారుల రక్షణ కోసం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ‘అభయం’ యాప్ ప్రారంభించారు. రవాణాశాఖ పర్యవేక్షణలో అమలయ్యే ఈ ప్రాజెక్టును సోమవారం ఉద‌యం ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం జగన్‌ మాట్లాడుతూ.. మహిళల ర‌క్ష‌ణ కోసం ఈ యాప్ దోహ‌దప‌డుతుంద‌ని చెప్పారు. ఆటోలు, ట్యాక్సీలు,ఇత‌ర ప్ర‌యాణ వాహ‌నాల్లో ‘అభయం’ యాప్ ప‌రిక‌రాన్ని అమ‌ర్చ‌నున్న‌ట్లు తెలిపారు. తొలి విడ‌త‌గా విశాఖ‌లో వెయ్యి ఆటోల్లో ప్ర‌యోగాత్మ‌కంగా అమ‌లుచేస్తున్న‌ట్లు వెల్ల‌డించారు.  వచ్చే నవంబర్ నాటికి లక్ష వాహనాలకు డివైజ్ ఏర్పాటు చేస్తాం’ అని పేర్కొన్నారు. మహిళల కోసం ఇప్పటికే అమ్మ ఒడి, చేయూత పథకాలు ప్రవేశపెట్టామని గుర్తుచేశారు. ఇళ్ల పట్టాలు కూడా మహిళల పేరుపైనే రిజిస్ట్రేషన్ చేస్తున్నామన్నారు. నామినేటెడ్ పదవులు,పనుల్లో మహిళలకు 50శాతం రిజర్వేషన్ కల్పించామని పేర్కొన్నారు. దేశంలోనే తొలిసారిగా దిశా బిల్లును ప్రవేశపెట్టి ఆదర్శంగా నిలిచా మ‌నిచెప్పారు. హోంమంత్రి, డిప్యూటీ సీఎం పదవుల్లో మహిళలకు అవకాశం కల్పించిట్లు స్పష్టం చేశారు. మహిళలకు ఆర్థిక, రాజకీయ స్వాలంబన కల్పించేలా అడుగులు వేస్తున్నామన్నారు. మహిళల రక్షణ, భద్రత విషయంలో ఏమాత్రం రాజీపడటంలేదని ఆయ‌న తెలిపారు.

అభయం’ అమలు ఇలా..


► రవాణా వాహనాల్లో ట్రాకింగ్‌ డివైస్‌లు ఏర్పాటు చేస్తారు.
► రవాణా వాహనాలకు దశలవారీగా ఐవోటీ బాక్సులు అమర్చాలి.
► తొలుత వెయ్యి ఆటోల్లో సోమవారం ఈ పరికరాలు ఏర్పాటు చేస్తారు. వచ్చే ఫిబ్రవరి 1 నాటికి ఐదువేల వాహనాలు, జూలై 1కి 50 వేల వాహనాలు, వచ్చే ఏడాది నవంబరు 31కి లక్ష వాహనాల్లో ఈ పరికరాలు అమరుస్తారు. ప్రాజెక్టు నిర్వహణ 2025 వరకు ఉంటుంది.
► ఆటోలు, క్యాబ్‌ల్లో ప్రయాణించే వారు తమ మొబైల్‌లో ‘అభయం’ మొబైల్‌ అప్లికేషన్‌ను ఇన్‌స్టాల్‌ చేసుకోవాలి. వాహనంఎక్కేముందు వాహనానికి అంటించిన క్యూ ఆర్‌ కోడ్‌ను స్కాన్‌ చేయాలి.
► స్కాన్‌ చేయగానే డ్రైవరు ఫోటో, వాహనం వివరాలు మొబైల్‌కు వస్తాయి.
► స్మార్ట్‌ ఫోన్‌ వినియోగించే మహిళలు తమ ప్రయాణంలో ఇబ్బందులు ఎదురైతే మొబైల్‌ యాప్‌ నుంచి సంబంధిత వాహనం నంబరు పంపితే వాహనం ఎక్కడుందో జీపీఎస్‌ ద్వారా తెలుసుకుని పట్టుకునేందుకు వీలుంటుంది.
► స్మార్ట్‌ ఫోన్‌ లేని ప్రయాణికులు వాహనానికి బిగించిన ఐవోటీ పరికరంలోని ప్యానిక్‌ బటన్‌ నొక్కితే సమాచారం కమాండ్‌ కంట్రోల్‌ సెంటరుకు చేరుతుంది. క్యాబ్‌/ఆటో వెంటనే ఆగిపోతుంది. ఆ వెంటనే సమీపంలోని పోలీస్‌ అధికారులకు సమాచారం పంపి పట్టుకుంటారు.
► ఐవోటీ ఆధారిత బాక్సుల్ని ఆటోలు, క్యాబ్‌లకు అమర్చాక డ్రైవర్ల లైసెన్సులకు రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిటీ టెక్నాలజీ (ఆర్‌ఎఫ్‌ఐడీ) కార్డులు ఇస్తారు.

Leave A Reply

Your email address will not be published.