ప్రజల మనోభావాలను దెబ్బతీసే పోస్టుల‌ను ఫార్వ‌ర్డ్ చేయొద్దు: డిజిపి

హైదరాబాద్‌ : గ్రేటర్‌ హైదరాబాద్‌ ఎన్నికలను ఆసరా చేసుకొని హైదరాబాద్‌ నగరంలో, తెలంగాణ రాష్ట్రంలోని కొన్ని చోట్ల కొంత మంది విధ్వంసక శక్తులు మత ఘర్షణలు, విద్వేశాలు సృష్టించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని, తమకు ఖచ్చితమైన సమాచారం ఉందని డీజీపీ మహేందర్‌రెడ్డి పేర్కొన్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. శాంతిభద్రతల విషయంలో తెలంగాణ పోలీస్‌ వ్యవస్థ అప్రమత్తంగా ఉందన్నారు. అన్ని జిల్లాల పోలీస్ అధికారులు, కమిషనర్లు, కింది స్థాయి సిబ్బంది అప్రమత్తంగా ఉన్నారన్నారు. విధ్వంసక శక్తుల విషయంలో పోలీస్‌ శాఖ అత్యంత కఠినంగా వ్యవహరిస్తుందన్నారు. ఎవరైనా, ఎంతటివారైనా వెనుకాడేది లేదని డీజీపీ స్పష్టం చేశారు.
సోషల్‌ మీడియా వేదికగా ప్రజల మనోభావాలను దెబ్బతీసి, సామరస్యపూర్వక వాతావరణాన్ని భగ్నం చేసే కుట్రలు జరుగుతున్నాయని డీజీపీ పేర్కొన్నారు. ఈ విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. సోషల్‌ మీడియాపై పోలీసు శాఖ నిఘా పెట్టిందని తెలిపారు. రెచ్చ‌గొట్టే పోస్టుల‌ను ఫార్వ‌ర్డ్ చేయొద్ద‌ని ప్ర‌జ‌ల‌కు మ‌హేంద‌ర్‌రెడ్డి సూచించారు. వ‌దంతులు, న‌కిలీ వార్త‌ల గురించి తెలిస్తే స‌మీపంలోని పోలీసు స్టేష‌న్‌కు తెలియ‌జేయాల‌న్నారు. గ్రేట‌ర్ ఎన్నిక‌ల ప్ర‌చారంలో నేత‌ల ప్ర‌సంగాల‌ను నిశితంగా ప‌రిశీలిస్తున్నామ‌ని పేర్కొన్నారు. రెచ్చ‌గొట్టే విధంగా మాట్లాడిన వారిపై చ‌ట్ట‌ప‌రంగా చ‌ర్య‌లు తీసుకంటామ‌ని డిజిపి స్ప‌ష్టం చేశారు. ఇప్ప‌టి వ‌ర‌కు సుమారు 50 మందిపై ఈ త‌ర‌హా కేసులు న‌మోదు చేసిన‌ట్లు చెప్పారు. వీటిపై న్యాయ‌స‌ల‌హా తీసుకుని ద‌ర్యాప్తు చేస్తామ‌న్నారు. ఎన్నిక‌ల ప్ర‌క్రియ ప్ర‌శాంతంగా జ‌రిగేందుకు ప్ర‌జ‌లంతా స‌హ‌క‌రించాల‌ని డిజిపి మ‌హేంద‌ర్‌రెడ్డి విజ్ఞ‌ప్తి చేశారు.

Leave A Reply

Your email address will not be published.