మూడు రోజుల్లో 4వేల పెళ్లిళ్లు!
కొవిడ్-19 వ్యాప్తి పెరిగే అవకాశముందని నిపుణుల హెచ్చరిక!
జైపూర్: కరోనా మహమ్మారి బుసలు కొడుతున్నా పెళ్లిళ్లు, ఇతర వేడుకల విషయంలో ప్రజలు వెనక్కి తగ్గడం లేదు. ఢిల్లీ, హర్యానా, రాజస్థాన్, గుజరాత్ వంటి కొన్ని రాష్ట్రాల్లో కరోనా సెకండ్ వేవ్ ప్రభావం కనిపిస్తోంది. సెకండ్ వేవ్ కారణంగా ఇప్పటికే రాజస్థాన్ ప్రభుత్వం అప్రమత్తం అయ్యింది. మంచి ముహూర్తాలు ఉండటంతో ఒక్క జైపూర్ నగరంలోనే రికార్డు స్థాయిలో పెళ్లిళ్లు జరుగనున్నట్లు అధికారులు వెల్లడించారు. ఈ నెల 30 వరకు 4 వేల వివాహాలు జరుగుతుండటం చర్చనీయాంశంగా మారింది. ఈ నెల 25, 27, 30 తేదీల్లో రికార్డు స్థాయిలో వివహాలు జరుగుతున్నాయని అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా కొవిడ్ మరింతగా విజృంభించే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
కఠిన నిబంధనలు..
కరోనా వ్యాప్తికి వివాహాలు క్లస్టర్స్ గా మారడంతో వివాహాలపై నియంత్రణ విధించారు. వివాహానికి 100 మంది కంటే ఎక్కువ మందికి అనుమతి ఇవ్వడం లేదు. అదే విధంగా మాస్క్, శానిటైజర్ ని తప్పనిసరి చేసింది ప్రభుత్వం. ఎవరైనా ఉల్లంఘనలకు పాల్పడితే రూ. 25 వేల వరకు జరిమానా విధించనున్నట్లు హెచ్చరిస్తోంది. వివాహ వేడుకలను విడియో తీసి ఉంచాలని సూచిస్తున్నట్టు ఆరోగ్యశాఖ డైరెక్టర్ కెకె శర్మ తెలిపారు.
కాగా రాజస్థాన్లో గత నాలుగు రోజుల నుంచి కరోనా కేసులు 1.34 శాతం పెరిగాయి. బుధవారం ఒక్కరోజే 3285 కొత్త కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలోనే అత్యధికంగా జైపూర్లో 600 కొత్త కేసులు నమోదయ్యాయి.