బొల్లారం పారిశ్రామిక వాడలో అగ్నిప్రమాదం
హైదరాబాద్ : సంగారెడ్డి జిల్లా ఐడీఏ బొల్లారంలో శనివారం భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. పారిశ్రామిక వాడలోని వింధ్యా ఆర్గానిక్ ఫ్యాక్టరీలో రియాక్టర్ పేలడంతో ఈ ప్రమాదం జరిగింది. పేలుడు కారణంగా కంపెనీలో భారీ శబ్ధంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో భయాందోళనలకు గురైన కార్మికులు కేకలు వేస్తూ బయటకు పరుగులు తీశారు. ఈ నేపథ్యంలో ఏడుగురు కార్మికులకు గాయాలు కావడంతో వారిని బాచుపల్లి ఆస్పత్రికి తరలించారు. కొంతమంది కార్మికులు కిందపడి గాయాలపాలయ్యారు. అందులో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. కంపెనీ మొత్తం రసాయనాలతో నిండిపోయింది. అక్కడికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తెస్తున్నారు. ప్రమాదం జరిగిన సమయంలో కంపెనీలో 120 మంది ఉన్నట్లు సమాచారం. అంతే కాకుండా ముందుజాగ్రత్త చర్చల్లో భాగంగా చట్టుపక్కల పరిశ్రమల్లోని రియాక్టర్లను సిబ్బంది చల్లబరుస్తున్నారు.