వ్యవసాయేతర భూముల రిజిస్ట్రేషన్లపై సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం

హైదరాబాద్‌: అవినీతికి ఆస్కారం లేకుండా, ప్రజలకు లంచాలు ఇచ్చే గతి పట్టకుండా, ఏ అధికారికీ విచక్షణాధికారం లేకుండా, అత్యంత పారదర్శకంగా, సులభంగా ఉండే విధంగా వ్యవసాయేతర ఆస్తులు – వ్యవసాయేతర భూముల రిజిస్ట్రేషన్ జరగాలని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు అధికారులను ఆదేశించారు. దీనికి అవసరమైన విధి విధానాలు, మార్గదర్శకాలు ఖరారు చేయాలని ఆదేశించారు. వ్యవసాయేతర ఆస్తులు – వ్యవసాయేతర భూముల రిజిస్ట్రేషన్ కు సంబంధించిన అనుసరించాల్సిన పద్ధతులపై మంత్రులు, ఉన్న‌తాధికారులతో ముఖ్య‌మంత్రి కెసిఆర్ ఇవాళ (ఆదివారం) ప్రగతి భవన్ లో సమీక్ష నిర్వహించారు.

మంత్రివ‌ర్గ ఉప‌సంఘం ఏర్పాటు

వ్యవసాయేతర భూముల రిజిస్ట్రేషన్ కోసం అవలంభించాల్సిన పద్ధతులపై అన్ని వర్గాలతో మాట్లాడి, అవసరమైన సూచనలు ఇవ్వడం కోసం ఆర్ అండ్ బి, గృహ నిర్మాణ శాఖల మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అధ్యక్షతన మంత్రివర్గ ఉపసంఘాన్ని సీఎం నియమించారు. ఈ కమిటీలో మున్సిపల్ శాఖ మంత్రి కేటీ రామారావు, పంచాయతీ రాజ్ శాఖమంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, హోం శాఖ మంత్రి మహమూద్ అలీ, పశు సంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ సభ్యులుగా ఉంటారు. మూడు నాలుగు రోజుల పాటు బిల్డర్లు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు, ఇతర వర్గాలతో సమావేశమై వారి అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుని అనుసరించాల్సిన వ్యూహం ఖరారు చేయాలని మంత్రి వర్గ ఉపసంఘాన్ని సీఎం ఆదేశించారు.

ఈ స‌మీక్షా స‌మావేశంలో మంత్రులు కేటీ రామారావు, మహమూద్ అలీ, వేముల ప్రశాంత్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, సీఎంఓ కార్యదర్శులు శేషాద్రి, స్మిత సభర్వాల్, రాజశేఖర్ రెడ్డి, భూపాల్ రెడ్డి, మీ సేవా కమిషనర్ జిటి వెంకటేశ్వర్ రావు, ఎమ్మెల్యే బాల్క సుమన్, ఎమ్మెల్సీ నవీన్ రావు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.