అందర్వేది రథాన్ని ప్రారంభించిన జగన్
అంతర్వేది: తూర్పుగోదావరి జిల్లా అంతర్వేదిలో కొలువైన లక్ష్మీ నరసింహస్వామిని శుక్రవారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దర్శించుకున్నారు. ఆలయం వద్దకు చేరుకున్న ముఖ్యమంత్రికి అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా కోటి రూపాయల వ్యయంతో నిర్మించిన నూతన రథాన్ని ఆయన ప్రారంభించారు. నూతన రథం వద్ద ప్రత్యేక పూజలు చేసిన ముఖ్యమంత్రి.. భక్తులతో కలిసి నూతన రథాన్ని తాడుతో లాగారు. 40 అడుగుల ఎత్తులో ఏడు అంతస్తులతో రూపుదిద్దుకున్న నూతన రథాన్ని కొత్త హంగులు, రక్షణ ఏర్పాట్లతో నిర్మాణం చేపట్టారు. 1,330 ఘనపుటడుగుల బస్తర్ టేకుతో నూతన రథం నిర్మాణం జరిగింది. రికార్డ్ స్థాయిలో 3 నెలల కాలంలోనే నూతన రథాన్ని నిర్మించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు కన్నబాబు, వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు.