ఆగం కావొద్దు.. ఆలోచనలో ఓటేయండి: సిఎం కెసిఆర్
నల్లగొండ: నాగార్జునసాగర్ నియోజకవర్గానికి కాంగ్రెస్ సీనియర్‌నేత జానారెడ్డి చేసింది శూన్యమని తెలంగాణ ముఖ్యమంత్రి, టిఆర్ ఎస్ అధినేత సిఎం కెసిఆర్ ఆరోపించారు. ముప్పయేళ్ల అనుభవమున్న జానారెడ్డి కనీసం నియోజకవర్గంలోని హీలియాకు డిగ్రీకాలేజీ కూడా తీసుకురాలేకపోయారని ఎద్దేవ చేశారు. నాగార్జునసాగర్ ఉపఎన్నిక ప్రచారంలో భాగంగా హాలియాలో ఏర్పాటు చేసిన టీఆర్ఎస్ పార్టీ బహిరంగ సభలో సీఎం పాల్గొని మాట్లాడారు. సభకు విచ్చేసిన మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు, అశేషంగా హాజరైన నాగార్జునసాగర్ ప్రజలందరికి సీఎం నమస్కారం తెలిపారు.
సభలో సీఎం మాట్లాడుతూ.. ఎన్నికలు రాగానే ఆగమాగం కావొద్దని.. పరిణితితో ఆలోచించి ఓటు వేయాలని ప్రజలకు సూచించారు. మిత్రుడు నోముల నర్సింహయ్యను కోల్పోవడం బాధాకరమని సిఎం అన్నారు. వామపక్ష పార్టీలో ఉంటూ ఆయన అనేక ఉద్యమాల్లో పాల్గొన్నారని గుర్తు చేశారు. ఆయన తనయుడు టిఆర్ ఎస్ అభ్యర్థి నోముల భగత్‌ను ఆశీర్వదించాలని కోరారు.

గతంలో హాలియా సభకు విచ్చేసినప్పుడు కూడా నేనే ఒకటే చెప్పినా. నేను చెప్పిందే వేదం అనుకోనవరం లేదని.. గ్రామాల్లోకి వెళ్లి చర్చ పెట్టాలని.. ఆపై ఆలోచనతోని, పరిణతితో ఓటు ఇవ్వాలని. ఎన్నికలు రాంగనే ఆగమాగం కావొద్దు. మన విచక్షణ ఉపయోగించాలి. గాడిదలకు గడ్డేసి ఆవుకు పాలు పితికితే పాలు రావు.. ముండ్ల చెట్లు పెట్టి పండ్లు కాయమంటే కాయవు. పండ్ల చెట్లు పెడితేనే కాయలు కాస్తాయి. ఈ ప్రకారమే యోచించి మీరు నిర్ణయం తీసుకోవాలి. ఎవరు గెలిస్తే మంచిదో.. ఎవరు గెలిస్తే ఈ నియోజవర్గం అభివృద్ధి చెందుతదో మీరు ఇప్పటికే ఓ అవగాహన వచ్చారు. పనిచేసే ప్రభుత్వాన్ని గెలిపించాలి. నర్సింహయ్య వారసుడిగా మీకు తగు రీతిలో సేవ చేస్తడని నోముల భగత్‌ను అభ్యర్థిగా నిలబెట్టడం జరిగింది. భగత్ గాలి భాగానే ఉంది. ఇది ఓటు రూపంలో డబ్బాలోకి కూడా రావాలే అని సీఎం పేర్కొన్నారు.
నాకు సిఎం పదవి భిక్ష.. తెలంగాణ ప్రజలది..
“కెసిఆర్‌కు సిఎం పదవి… జానారెడ్డి పెట్టిన భిక్ష అని ఒకాయన అన్నారు. నాకు సిఎం పదవి భిక్ష పెట్టింది తెలంగాణ ప్రజలు. పదవుల కోసమ పెదవులు మూసుకున్నోళ్లు కాంగ్రెస్ నేతలు. ఉద్యమం మొదలు పెట్టినప్పుడే డిప్యూటీ స్పీకర్, ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేసి గులాబీ జెండా ఎగురవేశా. వెనక్కి తిరగనని.. అలా చేస్తే రాళ్లతో కొట్టమని చెప్పా.. తెలంగాణ కోసం గడ్డిపోచల్లా పదవులను వదిలేశాం… అని గుర్తు చేశారు.
రైతు బంధు, రైతు భీమా, కల్యాణలక్ష్మి.. ఇలాంటో ప్రజలకు ఉపయోగపడే పథకాలు ప్రవేశపెట్టాం. అభివృద్ధి కళ్లముందే ఉంది. కాంగ్రెస్ నేతలు 60 ఏళ్లు పాలించి ఆగమాగం చేశారు. నాడు విద్యుత్ పరిస్థితి ఎలా ఉండేది? ఎప్పుడెలా ఉంది?
గోదావరిలో కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి ప్రజల పాదాలు కడుగుతున్నాం.. నెల్లికల్ లిఫ్ట్‌లో మీరు కూడా కేరింతు కొట్టాలి.. బల్ల గుద్ది.. రొమ్ము విరిచి.. కాలర్ ఎగరేసి చెబుతున్నా.. దేశంలో ఈ యాసంగిలో 52.79 లక్షల ఎకరాల్లో నా తెలంగాణ వరి సాగు చేసింది. అభివృద్ధిని చూసీ చూడనట్టు ఉండొద్దు. ఒట్టిమాటలకు మోసపొవద్దు. భగత్‌ను ఆదరించి టిఆర్ ఎస్‌ను గెలిపిస్తే చాలా మంచి జరుగుతుంది. ఓటు వేసే ముందు దయచేసి ప్రజలు ఆలోచన చేయాలి“ అని కెసిఆర్ కోరారు.