ఇంటర్ ఫస్టియర్ ఎగ్జామ్స్ రద్దు.. రెండో సంవత్సరం పరీక్షలు వాయిదా
హైదరాబాద్: తెలంగాణలో రోజురోజుకూ కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్న నేపధ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణలో పదో తరగతి, ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలను రద్దు చేయగా.. ఇంటర్ రెండో సంవత్సరం పరీక్షలను వాయిదా వేసింది. కరోనా ఉధృతి దృష్ట్యా రాష్ట్రంలో పరీక్షలను రద్దు చేసింది.
మొదటి సంవత్సరం విద్యార్థులను పరీక్షలు లేకుండానే పైతరగతులకు ప్రమోట్ చేసింది. అలాగే రెండో సంవత్సరం పరీక్షలను వాయిదా వేస్తున్నామని సర్కార్ ప్రకటించింది. జూన్‌లో కరోనా పరిస్థితులను పరిశీలించి ఆ తర్వాత రెండో సంవత్సరం పరీక్షలపై తుది నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేసింది.
అటు ఇంటర్ సెకండియర్‌లో బ్యాక్‌లాగ్స్ ఉన్న విద్యార్ధులకు మినిమమ్ పాస్ మార్కులు ఇవ్వనున్నట్లు ప్రకటించింది. అలాగే ఈ ఇయర్ ఎంసెట్‌లో 25 శాతం ఫస్టియర్ ఇంటర్మీడియట్ మార్కులకు సంబంధించిన వెయిటేజీ ఉందని ప్రభుత్వం వెల్లడించింది. అటు ఇంటర్ ప్రాక్టికల్స్ మే 29 నుంచి జూన్ 7 వరకు ఉంటాయని ఇప్పటికే ఇంటర్ బోర్డు ప్రకటించింది.
