భూమిని చదును చేస్తుండగా దొరికిన రూ.60 లక్షల వజ్రం
భోపాల్: అదృష్టం ఎలా వస్తుందో ఎవరమూ ఊహించలేము.. అదృష్టం ముంటే ఏ మూలన కూర్చున్నా కావాల్సింది వెతుక్కుంటూ వస్తుంది. ఇలాంటి ఒక సంఘటన ఒకటి ఇటీవల మద్యప్రదేశ్ రాష్ట్రంలో జరిగింది. మధ్యప్రదేశ్ రైతు ఒకరికి తాను లీజుకు తీసుకున్న భూమిలో లక్షల విలువైన వజ్రం దొరికింది. దాంతో నిన్నటివరకు పూటగడవడానికి ఏడ్చిన ఆ రైతు.. తెల్లారేసరికల్లా లక్షాధికారిగా మారాడు.
వివరాల్లోకి వెళ్తే.. మధ్యప్రదేశ్‌కు చెందిన 45 ఏండ్ల వయసున్న లఖన్ యాదవ్.. తన గ్రామానికి చెందిన ఓ చిన్న భూమిని రూ. 200 కు లీజుకు తీసుకున్నాడు. దానిలో కూరగాయలు పండించాలని అనుకుని చదును చేయించడం ప్రారంభించాడు. అలా తవ్వుతుండగా కొన్ని రంగు రాళ్లు బయటపడ్డాయి. వాటిని భద్రంచేసి.. తెలిసిన వారి ద్వారా శుభ్రం చేసే వారికి చూపించగా.. అది 14.98 క్యారెట్ల వజ్రంగా వెల్లడైంది. దాంతో దాన్ని అమ్మకానికి పెట్టగా శనివారం నాడు లఖన్యాదవ్కు రూ.60.6 లక్షల సొమ్ము అందింది. భిన్నంగా కనిపించిన గులకరాయితో పాటు భూమిని తవ్విన క్షణాలను తాను ఎప్పటికీ మరచిపోలేనని లఖన్ యాదవ్ చెప్పారు. అదృష్టం మారడంతో వజ్రం అమ్మగా వచ్చిన సొమ్ముతో తన నలుగురు పిల్లలకు మంచి విద్యాబుద్దులను చెప్పించాలని కోరుకుంటున్నట్లు తన మనుసులోని మాటను వెల్లడించారు.