హైకోర్టు న్యాయవాద దంపతుల దారుణ హత్య

మంథ‌ని: పెద్దపల్లి జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. మంథనికి చెందిన హైకోర్టు న్యాయవాదులు గట్టు నాగమణి, వామన్ రావు దంపతులు దారుణ హత్యకు గురయ్యారు. వారిపై దుండ‌గులు విచ‌క్ష‌ణార‌హితంగా దాడి చేసి హ‌త‌మార్చారు. న్యాయ‌వాది గ‌ట్టు వామ‌న్‌రావు, ఆయ‌న భార్య నాగ‌మ‌ణి మంథని కోర్టులో ప‌ని ముగించుక‌ని హైదరాబాద్ కి వెళ్తుండగా రామగిరి వద్ద బుధవారం ఈ ఘటన చోటుచేసుకుంది. రామ‌గిరి మండ‌లం క‌ల్వ‌చ‌ర్ల పెట్రోలు బంకు ఎదుట న్యాయవాది గట్టు వామన్ రావు వాహనంపై గుర్తు తెలియని వ్యక్తులు దాడికి పాల్పడి దంపతుల ఇద్దరినీ దారుణంగా నరికి హత్య చేశారు. వేట కొడవళ్లు, కత్తులతో దాడి చేశారని ప్రాణాపాయ స్థితిలో ఉన్నప్పుడు న్యాయవాది వాగ్మూలం ఇచ్చారు. గుంజపడుగుకు చెందిన కుంట శ్రీనివాస్ తమపై దాడి చేసినట్లు తెలిపారు. 108 వాహ‌నంలో పెద్ద‌పెల్లి ఆస్ప‌త్రికి త‌ర‌లిస్తుండ‌గా మార్గ‌మ‌ధ్యంలో వారిద్దరూ మృతిచెందారు. ఈ హ‌త్య నేప‌థ్యంలో దుండ‌గుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. చెక్‌పోస్టుల వ‌ద్ద ముమ్మ‌రంగా త‌నిఖీలు నిర్వ‌హిస్తున్నారు. మ‌రోవైపు న్యాయ‌వాది కారు డ్రైవ‌ర్‌ను అదుపులోకి తీసుకుని పోలీసులు విచారిస్తున్నారు.

వామ‌న్‌రావు, శ్రీ‌నివాస్‌ల స్వ‌స్థ‌లం మంథ‌ని మండ‌లం గెంజెప‌డుగు. శీలం రంగ‌య్య లాకప్‌డెత్ కేసును వామ‌న్‌రావు వాదించారు. ఈ నేప‌థ్యంలో కుంటు శ్రీ‌నివాస్‌, కుమార్‌ల‌పై త‌మ‌కు అనుమానం ఉన్న‌ట్లు వామ‌న్‌రావు సోద‌రుడు ఇంద్ర‌శేఖ‌ర్ ఆరోపించారు. ఈ ఘ‌ట‌న‌పై స‌మ‌గ్ర ద‌ర్యాప్తు జ‌రిపి న్యాయం చేయాల‌ని ఆయ‌న కోరారు.

హత్య ఆరోపణలు ఎదుర్కొంటున్న కుంట శ్రీనివాస్‌ టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడిగా బాధ్యతల్లో ఉన్నట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. కేసు నమోదు చేసుకుని విచారణ ప్రారంభించారు. స్థానికంగా ఈ ఘటన కలకలం రేపింది.

నిందితుల‌ను వ‌ద‌లం: రామ‌గుండం సిపి
హైకోర్టు న్యాయ‌వాది వామ‌న్‌రావు దంప‌తుల హ‌త్య కేసుపై అన్ని కోణాల్లో ద‌ర్యాప్తు చేస్తున్నామ‌ని రామగుండం సిపి స‌త్య‌నారాయ‌ణ తెలిపారు. దుండ‌గుల‌ను ప‌ట్టుకునేందుకు ఆరు ప్ర‌త్యేక బృందాల‌తో గాలిస్తున్నామ‌న్నారు. నిందితులు ఎంత‌టివారైన వ‌ద‌లబోమ‌ని సిపి స్ప‌ష్టం చేశారు.

Leave A Reply

Your email address will not be published.