ఉపాధ్యాయునిగా మారిన హరీష్ రావు!
విద్యార్థులను ఉన్నతంగా తీర్చిదిద్దాలి : మంత్రి
మెదక్ : ఎప్పుడూ రాజకీయాలతో బిజీగా ఉండే మంత్రి హరీష్ రావు ఉపాధ్యాయుని అవతారం ఎత్తారు. మెదక్ జిల్లా పాపన్న పేట మండలం, కొత్తపల్లి గ్రామంలోని జిల్లా పరిషత్ పాఠశాల లో మంత్రి హరీశ్ రావు పాఠాలు చెప్పిన అంశం ఆసక్తికరంగా మారింది. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులను ఉన్నతంగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత ఉపాధ్యాయులదేనని ఆర్థికశాఖ మంత్రి హరీశ్ రావు అన్నారు. బుధవారం కొత్తపల్లి గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను ఆయన తనిఖీ చేశారు. విద్యార్థులతో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కరోనా సమయంలో పాఠశాలలో పరిస్థితులు, చదువులు సాగుతున్న తీరు, మధ్యాహ్న భోజన వసతిపై మంత్రి ఆరా తీశారు. విద్యార్థుల ప్రతిభా పాఠవాలను పరీక్షించేందుకు పలు సబ్జెక్టుల్లో ప్రశ్నలు అడిగి సమాధానాలు రాబట్టారు. తెలుగు, లెక్కల సబ్జెక్టు లలో విద్యార్థులను మంత్రి హరీష్ రావు ప్రశ్నలు అడిగి తెలుసుకున్నారు. డాక్టర్ కావాలంటే ఏం చదవాలి..? డాక్టర్ అయితే అమెరికా వెళ్తావా..? ఇక్కడ ఉండి ప్రజలకు సేవ చేస్తావా అని విద్యార్థి మనోగతాన్ని మంత్రి అడిగి తెలుసుకున్నారు. పోలీసు అవుతాన్న విద్యార్థితో, పోలీసయితే ఏం చేస్తావని మంత్రి ప్రశ్నించారు. అనంతరం తెలుగు నుడికారాలు, జాతీయాలు, సామెతలు, సోంత వాక్యాలపై ప్రశ్నలు వేశారు. పాఠశాలలో మరిన్ని వసతులు కల్పించాలని అధికారులను ఆదేశించారు. విద్యార్థుల సమగ్రాభివృద్ధికి ఉపాధ్యాయులు మరింత అంకితభావంతో పనిచేయాలని హరీశ్ రావు చెప్పారు.