న్యాయవాదుల హత్య కేసులో ముగ్గురు అరెస్టు
కేసు వివరాలు వెల్లడించిన ఐజీ నాగిరెడ్డి
పెద్దపల్లి: హైకోర్టు న్యాయవాద దంపతులు గట్టు వామన్‌రావు, నాగమణి హత్య కేసులో నిందితులు ముగ్గురిని అరెస్టు చేసినట్లు నార్త్‌జోన్ ఐజీ నాగిరెడ్డి తెలిపారు. హత్య కేసులో నిందితుల వివరాలను పోలీసు అధికారులు వెల్లడించారు. ఈ ఉదయం 11 గంటల సంయంలో మహారాష్ట్ర సరిహద్దులో నిందితులు కుంటు శ్రీను, శివందుల చిరంజీవి, ఆ తర్వాత వారికి సహకరించిన అక్కుపాక కుమార్‌ను అరెస్టు చేశామన్నారు. సాంకేతికత సాయంతో 24 గంటల వ్యవధిలోనే నిందితులను పట్టుకున్నట్లు చెప్పారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని ఏసీపీ కార్యాలయ ఆవరణలో నార్త్‌జోన్ ఐజీ నాగిరెడ్డి, రామగుండం పోలీస్ కమిషనర్ సత్యనారాయణ మీడియా సమావేశం నిర్వహించారు.
హత్య కేసులో ఏ-1గా మంథని మండలం గంపజపడుగు గ్రామానికి చెందిన కుంట శ్రీనివాస్, ఏ-2గా అక్కపాక కుమార్, ఏ-3గా శివందుల చిరంజీవి ఉన్నట్లు వీరిని అరెస్టు చేసినట్లు ఐజీ వెల్లడించారు.
“న్యాయవాది వామన్‌రావు, కుంట శ్రీనుది గుంజపడుగు గ్రామం. గ్రామంలో వీరిద్దరి మధ్య చాలా రోజులుగా వివాదాలు నడుస్తున్నాయి. గ్రామంలోని ఆలయ భూమి విషయంలో ప్రధానంగా వివాదముంది. ఈ విషయంలో శ్రీనుని వామన్‌రావు ఎదుర్కొంటున్నారు. దాన్ని తట్టుకోలేక వామన్‌రావును హత్య చేయాలని శ్రీను నిర్ణయించుకన్నట్లు విచారణలో తేలింది. విచారణలో శ్రీను ఎక్కడా రాజకీయ కారణాలు చెప్పలేదు. శ్రీను, చిరంజీవి కలిసి హత్య చేశారు. శ్రీనుపై కొన్ని పాత కేసులు ఉన్నాయి. ఇంకా విచరణ కొనసాగుతోంది. మిగతా నిందితుల పాత్రపై పూర్తి విచారణ అనంతరం చెబుతాం“ అని ఐజి తెలిపారు.