పాత‌క‌క్ష‌ల‌కు ఆరుగురి బ‌లి

విశాఖ‌ప‌ట్ట‌ణం: ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం జిల్లాలో దారుణం జరిగింది. పెందుర్తి మండ‌లం జుత్తాడ‌లో పాత కక్షలకు ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు బ‌ల‌య్యారు. కొద్ది రోజులుగా రెండు కుటుంబాల మ‌ధ్య ఘ‌ర్ష‌ణ‌లు జ‌రుగుతున్నాయి. ఈ క్ర‌మంలో బ‌త్తిన అప్ప‌ల‌రాజు అనే వ్య‌క్తి అర్ధ‌రాత్రి ఇంట్లో నిద్రిస్తున్న మ‌రో కుటుంబంలోని ఆరుగురిని అత్యంత కిరాతకంగా హ‌త‌మార్చాడు. చిన్న పిల్లలను సైతం అత్యంత పాశవికంగా పొట్టనబెట్టుకున్నాడు. ఈ దారుణ సంఘటన రాష్ట్రవ్యాప్తంగా కలకలం సృష్టించింది.

వివరాలు.. పాత కక్షల నేపథ్యంలోబ‌త్తిన అప్ప‌ల‌రాజు ఇంట్లో నిద్రిస్తున్న రమణ కుటుంబంపై దాడి చేసి చంపాడు. పదునైన ఆయుధంతో ఇంట్లో ఉన్న కుటుంబసభ్యులందరినీ దారుణంగా హత్యచేశాడు. మృతదేహాలన్నీ రక్తపు మడుగులో పడి ఉండటాన్ని చూసిన స్థానికులు పోలీసులకు సమాచారమిచ్చారు. అనంతరం పెందుర్తిలోని సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సీపీ మనీష్ కుమార్ కూడా సంఘటనా స్థలానికి చేరుకొని వివరాలను అడిగి తెలుసుకున్నారు. మృతులు రమణ (63), ఉషారాణి (35), రమాదేవి (53), అరుణ(37) చిన్నారులు ఉదయ్ (2), ఉర్విష (6 నెలలు)గా గుర్తించారు.

ఘ‌ట‌న త‌ర్వాత నిందితుడు అప్ప‌ల‌రాజు నేరుగా పెందుర్తి పోలీసు స్టేష‌న్కు వెళ్లి లొంగిపోయిన‌ట్లు తెలిసింది. కేసు న‌మోదు చేసిన పోలీసులు ద‌ర్యాప్తు చేస్తున్నారు. నిందితుడు లొంగిపోయిన విష‌యాన్ని పోలీసులు ఇంకా దృవీక‌రించ‌లేదు. ఆరుగురి హత్యతో జుత్తాడలో విషాదకర పరిస్థితులు నెలకొన్నాయి. ఆరుగురి హత్యపై ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి.

Leave A Reply

Your email address will not be published.