గణతంత్రం : సెలవు కాదు… హెచ్చరిక!
జనవరి 26
ఒక పండుగ కాదు,
ఒక సెలవు కాదు
ప్రజల చేతిలో పెట్టిన
పాలనా అస్త్రానికి గుర్తు.
బ్రిటిష్ రాజు కాదు,
దేశీయ దోపిడీదారుడూ కాదు,
“ప్రజలే ప్రభువులు” అని
రాతితో కాదు
రాజ్యాంగంతో తేల్చిన రోజు.
సమానత్వం కాగితాలకే పరిమితమై,
న్యాయం కోర్టు మెట్లకే చిక్కి,
స్వేచ్ఛ మాటలకే పరిమితమై ఉన్నప్పుడు
గణతంత్రం ప్రశ్నగా మారుతుంది!
జెండా ఎగరేస్తే సరిపోదు,
పరేడ్ చూస్తే చాలదు,
ప్రజల హక్కులు తుంచేస్తూ
గణతంత్ర గీతాలు పాడితే
అది దేశభక్తి కాదు
నటనం!
రాజ్యాంగం
అల్మారీలో దాచే గ్రంథం కాదు,
ఎన్నికల వేళ వాడే నినాదం కాదు,
ప్రతి పాలకుడి మెడలో
ఎప్పుడూ వేలాడే
జవాబుదారితనం!
గణతంత్రం నిలవాలంటే
ప్రజలు మౌనంగా ఉండకూడదు,
ప్రశ్నించాలి…
ఎదురుచూడకూడదు,
ఎదుర్కోవాలి!
ఇది శుభాకాంక్ష కాదు
ఇది హెచ్చరిక.
ఇది పండుగ కాదు
ప్రజాస్వామ్యానికి పెట్టిన
రోజువారీ పరీక్ష!
జైహో గణతంత్రం!
జైహో ప్రశ్నించే ప్రజలు!
–ఎస్.వి.రమణా చార్య
సీనియర్ జర్నలిస్టు
సెల్ : +91 98498 87086